
మిస్టరీగా మారిన ఈశ్వర్ మృతి
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన యువకుడు ఈశ్వర్ మృతి మిస్టరీగా మారింది. శనివారం రాత్రి కాలనీ శివారులో అనుమానాస్పదంగా మృతిచెందిన యువకుడిని ప్రేమ వ్యవహారంలో హతమర్చారా..? లేక రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాదగోని సత్యనారాయణ, నాగమణి దంపతుల కుమారుడు మాదగోని ఈశ్వర్(19) ఈ ఏడాది ఇంటర్ పూర్తిచేసి స్థానికంగా ఓ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. కొంత కాలంగా పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు తన స్నేహితుల ద్వారా తెలిసింది. అయితే మృతుడు నడుపుతున్న బైక్ మృతదేహానికి వంద అడుగుల దూరంలోని పొలంలో పడి ఉండడం.. గొంతుపై కత్తితో కోసినట్లుగా గాయం ఉండడంతో హత్యగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే.. మృతదేహం తల, ఇతర భాగాలపై గయాలు కనిపించాలి కానీ అలాంటి ఆనవాలు కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈశ్వర్ మృతిచెందిన విషయం అతడు ప్రేమించిన యువతికి తెలియడంతోపాటు మృతదేహం ఫొటోలు ఆమె ఫోన్‌కు వీడియోలు పంపడం వెనుక హత్యకుట్ర దాగి ఉన్నట్లు కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కులాంతర ప్రేమను విచ్ఛిన్నం చేసేందుకు పథకం ప్రకారం హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బాధ్యులను కఠినంగా శిక్షించాలి
మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రి మార్చురీ వద్ద కాలనీ వాసులు, బంధువులు చేరుకుని తమకు న్యాయం చేయలని ఆందోళన వ్యక్తం చేశారు. వన్‌టౌన్ పోలీస స్టేషన్‌కు వెళ్లి ఈశ్వర్ మృతికి బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులతో వన్‌టౌన్ సీఐ మోతీరాం మాట్లాడుతూ ఈశ్వర్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని..త్వరలోనే నింధితులను గుర్తించి మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈశ్వర్ తిరిగిన ప్రాంతాలను సీసీ ఫుటేజిల ద్వారా పరిశీలిస్తున్నామని, మృతుడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని అతడి కాల్ డేటాను సేకరిస్తున్నామని చెప్పారు. సీఐ హామీతో మృతుడి బంధువులు ఆందోళన విరమించుకున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈశ్వర్ తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ పేర్కొన్నారు.
న్యాయం చేయాలంటూ
బంధువుల ఆందోళన