
ఆర్‌ఎంపీపై సుమోటోగా కేసు నమోదు
తుంగతుర్తి : ఆర్‌ఎంపీ చికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటనపై స్పందించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సదరు డాక్టర్‌పై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ వైద్య మండలి వైస్ చైర్మన్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్ తెలిపారు. వైద్యం వికటించి మహిళ మృతి అనే వార్త వివిధ పత్రికల్లో ప్రచురితం కావడంతో ఆదివారం తుంగతుర్తిలోని సాయి బాలాజీ ప్రైవేట్ ఆస్పత్రిని సందర్శించి విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుంగతుర్తిలో ఆర్‌ఎంపీ శ్రీనివాస్ కొన్నేళ్లుగా ప్రభుత్వ అనుమతులు లేకుండా సాయి బాలాజీ ఆస్పత్రి నిర్వహించడంతోపాటు గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేయిస్తున్నారని స్థానికులు తెలిపారన్నారు. ఆయన వెంట డాక్టర్ విష్ణు తదితరులు ఉన్నారు.
అర్హత లేకుండా వైద్యం చేస్తే కఠిన చర్యలు
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాలో అర్హత లేని వైద్యులు ఆస్పత్రులు నిర్వహిస్తూ వైద్యం చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు. తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిలో అబార్షన్ సమయంలో వైద్యం వికటించి మృతి చెందిన గర్భిణి కేసుపై కలెక్టర్ ఆదివారం తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై తక్షణమే విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్‌ఓ వెంటనే తుంగతుర్తిలోని సాయి బాలాజీ ఆస్పత్రిని సందర్శించి విచారణ చేపట్టారు. ఆర్‌ఎంపీ కొరివిల్ల శ్రీనివాస్ అబార్షన్ చేయడం వల్లే విజేత అనే గర్భిణి మృతిచెందిందని డీఎంహెచ్‌ఓ తెలిపారు.