
రైతులు నష్టపోకుండా డబ్ల్యూడీఆర్‌ఏ
మోత్కూరు: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను తక్కువ ధరకు విక్రయించి నష్టపోతున్నారని, దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం వేర్‌హౌజింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యూడీఆర్‌ఏ) ఏర్పాటు చేసిందని.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్ (ఐసీఎం)ప్రోగ్రాం డైరెక్టర్ శ్యామ్‌కుమార్ తెలిపారు. మోత్కూరు మండల కేంద్రంలోని ఎఫ్‌ఎస్‌సీఎస్ డబ్ల్యూడీఆర్‌ఏపై బుధవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను అమ్ముకునే సమయంలో గిట్టుబాటు ధర దక్కకపోవడం, నిల్వ ఉంచుకునే పరిస్థితి ఉండటం లేదన్నారు. పంట పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చడానికి తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితిని నివారించి అధిక ధర వచ్చినప్పుడు పంటను అమ్ముకునే సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఎక్కడికక్కడ వేర్‌హౌజింగ్ గోదాములను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు ఈ గోదాముల్లో నామమాత్రపు రుసుముతో పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవచ్చని సూచించారు. నిల్వ చేసిన పంటపై 80 శాతం వరకు బ్యాంకులు తక్షణ రుణ సదుపాయం కల్పిస్తాయన్నారు. అనంతరం రైతులకు శిక్షణ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామనర్సయ్య, గోదాం మేనేజర్ వీరబాబు, సింగిల్‌విండో చైర్మన్ పి.వెంకటేశ్వర్లు, సీఈఓ వరలక్ష్మి, వైస్ చైర్మన్ బండ పద్మ, డైరెక్టర్లు స్వామి, లక్ష్మయ్య, ముత్తయ్య, రాములు, మల్లయ్య, సుజాత, రైతులు పాల్గొన్నారు.
ఫ ఐసీఎం ప్రోగ్రాం డైరెక్టర్ శ్యామ్‌కుమార్