అధిక వర్షాలకు పంటల రక్షణ ఇలా.. | - | Sakshi
Sakshi News home page

అధిక వర్షాలకు పంటల రక్షణ ఇలా..

Aug 14 2025 6:37 AM | Updated on Aug 14 2025 6:37 AM

అధిక

అధిక వర్షాలకు పంటల రక్షణ ఇలా..

పెద్దవూర: గత మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో పత్తి, మిరప, పప్పుదినుసుల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ పంటలు నీటిలో మునగడంతో వాటికి చీడపీడల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సకాలంలో పంటల రక్షణ చర్యలు చర్యలు చేపట్టకపోతే దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. రైతులు పాటించాల్సిన జాగ్రత్తలను పెద్దవూర మండల వ్యవసాయ అధికారి సందీప్‌ వివరించారు.

పత్తి పంట:

● సాధ్యమైనంత వరకు చేనులో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఎప్పటికప్పుడు కాల్వలను ఏర్పాటు చేసుకుని నీటిని తొలగించాలి.

● వర్షాలు తగ్గిన వెంటనే వీలైనంత త్వరగా భూమిలో తేమను తగ్గించేందుకు అంతర సేద్యం చేయాలి.

● అంతర సేద్యం చాలారోజుల వరకు వీలుకాకపోతే, కలుపు సమస్య ఎక్కువగా ఉంటే విత్తిన 45–60 రోజుల పైరులో ఎకరాకు 400 మి.లీ., క్విజల్‌ ఫాస్‌ ఇథైల్‌+ఫైరిథయోబాక్‌ సోడియం 250 మి.లీ. కలిపి పిచికారీ చేసి కలుపును నివారించుకోవాలి.

● వర్షాలు తగ్గాక వెంటనే బురద పదునులో ఎకరాకు 30 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరట్‌ ఆఫ్‌ పొటాష్‌ను పైపాటుగా వేయాలి. లీటరు నీటికి 10 గ్రాముల పొటాషియం నైట్రేట్‌, 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్‌ కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలి.

● విత్తిన సమయంలో భాస్వరం ఎరువును వేయని రైతులు ఎకరాకు 50 కిలోల డీఏపీ ఎరువు వేసుకోవచ్చు.

● ఆకుపచ్చ తెగుళ్ల తీవ్రత పెరగడానికి అవకాశం ఉన్నందున వర్షాలు తగ్గాక సాఫ్‌ లేదా కంపానియన్‌ అనే శిలీంధ్రనాశిని మందు 2 గ్రాముల చొప్పున, అలాగే ఫ్లాంటోమైసిన్‌ లేదా స్ట్రిప్టోసైక్టిన్‌ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

● పత్తిలో వర్షాలు తెరిపి ఇచ్చిన తర్వాత పిండినల్లి ఉధృతి ఎక్కువయ్యే అవకాశం ఉంది. దీని నివారణకు గాను లీటరు నీటికి 1 మి.లీ. డైక్లోరోఫాస్‌తో పాటు 2మి.లీ. ఫ్రొఫినోఫాస్‌ మందును కలిపి పిచికారీ చేసుకోవాలి.

● వర్షాలు తగ్గిన మూడు, నాలుగు రోజులకు వరుసల మధ్య భాగాన్ని గుంటుకలతో దున్నాలి.

● అధిక వర్షాలకు వేరుకుళ్లు తెగులు ఆశిస్తే లీటరు నీటికి 3గ్రాముల కాఫర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా ఒక గ్రామ్‌ కార్భండిజమ్‌ కలిపి మొక్క మొదళ్లలో తడపాలి.

పెసర, మినుము:

● పెసర, మినుము పంటల్లో పేనుబంక, లద్దెపురుగు ఆశించే అవకాశం ఉంది. లీటరు నీటికి ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్‌ 1.6 మి.లీ కలిపి పిచికారీ చేయాలి.

● 20 నుంచి 25 రోజుల దశలో ఉన్న పంటలో కలుపు ఎక్కువగా ఉంటే అంతరసేద్యం సాధ్యంకానప్పుడు పెసర, మినుము పంటలలో ఎకరాకు 200 మి.లీ. ఇమిజిథాపిర్‌ను 200 మి.లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందు వాడినప్పుడు పంట పెరుగుదల తాత్కాలికంగా వారం రోజులు ఆగుతుంది. తర్వాత తేరుకుని మామూలుగా ఉంటుంది.

● వర్షాలకు ఆకుపచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ కలిపి పిచికారీ చేయాలి.

మిరప:

● మిరప నారుమళ్లలో వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి.

● నారుకుళ్లు తెగులు నారుమళ్లను ఆశిస్తే లీటర్‌ నీటికి 3 గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా 2 గ్రాముల రిడోమిల్‌ కలిపి వారంలో రెండు, మూడుసార్లు నారుమళ్లను తడపాలి.

● నాటిన మిరప చేలలో నీరు నిల్వ లేకుండా చూడాలి.

కంది:

● పొలంలో నిల్వ ఉన్న నీటిని త్వరగా బయటకు పంపాలి.

● ఎకరాకు 15 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరట్‌ ఆఫ్‌ పొటాష్‌లను పైపాటుగా వేయాలి.

● ఇనుపధాతు లోపం వచ్చే అవకాశం ఉన్నందున లీటరు నీటికి అన్నభేది 5–10 గ్రాములు,+ 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు, లేదా మూడు సార్లు పిచికారీ చేయాలి.

● అధిక తేమ వల్ల ఎండుతెగులు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో మొక్కలు వాడుబడుతున్నట్లు కనిపిస్తే లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కార్భండిజమ్‌ కలిపి మొక్కల మొదళ్ల దగ్గర తడపాలి.

మొక్కజొన్న:

ముందుగా ఎకరానికి 50 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్‌ను పైపాటుగా వేయాలి.

కాండం తొలిచే పురుగు, ఆకు ఎండు తెగులు తీవ్రత ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. దీని నివారణకు గాను ఎకరానికి 400 మి.లీ ఫ్రొఫినోఫాస్‌, 200 మి.లీల ఫ్రొఫికొనజోల్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి చేను బాగా తడిసే విధంగా పిచికారీ చేయాలి.

వర్షాలు తగ్గిన తర్వాత వరుసలలో గుంటుకతో దున్నాలి.

అధిక వర్షాలకు పంటల రక్షణ ఇలా..1
1/1

అధిక వర్షాలకు పంటల రక్షణ ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement