
మద్యం తాగొద్దన్నందుకు వ్యక్తి ఆత్మహత్య
గుర్రంపోడు: తల్లి సంవత్సరీకం రోజున మద్యం తాగొద్దన్నందుకు మనస్తాపానికి గురైన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం గుర్రంపోడు మండల కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రంపోడు మండలకేంద్రానికి చెందిన మోపూరి లింగారెడ్డి(58) మంగళవారం రాత్రి తన తల్లి సంవత్సరీకం సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఇంట్లో మద్యం తాగుతున్నాడు. మద్యం ఎక్కువగా తాగుతున్నావు, లేచి అన్నం తిను అని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.