
అత్యాచారం కేసులో 26 ఏళ్ల జైలు శిక్ష
రామగిరి(నల్లగొండ): బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 26 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు జడ్జి రోజారమణి బుధవారం తీర్పు వెలువరించారు. ప్రొసిక్యూషన్ కథనం ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని లైన్‌వాడకు చెందిన గ్యారాల శివకుకుమార్ బీటీఎస్ ప్రాంతానికి చెందిన వసంతపురి యాదమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మైనర్ అయిన యాదమ్మ కూతురుపై కూడా కన్నేశాడు. యాదమ్మ సహకారంతో శివకుమార్ ఆమె కుమార్తైపె అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2023 మే 8న నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో యాదమ్మ, శివకుమార్‌పై కేసు నమోదు చేసి వారిద్దరిని కోర్టులో హాజరుపర్చారు. మంగళవారం కోర్టు విచారణలో యాదమ్మ హాజరుకాగా 22 ఏళ్ల జైలు శిక్ష రూ.5వేల జరిమాన విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించింది. శివకుమార్ పారిపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నల్లగొండ టూటౌన్ పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. జడ్జి విచారణ జరిపి శివకుమార్‌కు 26 ఏళ్ల జైలు శిక్ష, రూ.40వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రొసిక్యూటర్ వేముల రంజిత్‌కుమార్ వాదనలు వినిపించారు.
విద్యుదాఘాతంతో
వ్యక్తి మృతి
నార్కట్‌పల్లి: విద్యుదాఘాతంతో పానీపూరి
బండి నిర్వాహకుడు మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన రమావంత్ రమేష్(39) కొన్నేళ్లుగా స్థానిక బస్టాండ్ ఎదురుగా పానీపూరి బండి నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం రాత్రి వర్షం కురుస్తుండగా.. పానీపూరి బండికి ఏర్పాటు చేసిన విద్యుత్ లైట్ వెలగకపోవడంతో దానిని సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ క్రాంతికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ..
తుంగతుర్తి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం అన్నారం గ్రామానికి చెందిన బుర్ర పద్మయ్య(62) తన టీవీఎస్ ఎక్సెల్‌పై సోమవారం తుంగతుర్తికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. అన్నారం ఎక్స్ రోడ్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. అతడి తలకు తీవ్రగాయాలు కాగా.. చికిత్స నిమిత్తం తుంగతుర్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపారు. తుంగతుర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
పోస్టుమాస్టర్ అరెస్ట్
అడ్డగూడూరు: ఖాతాదారుల డబ్బులు వాడుకుని మోసం చేసిన పోస్టుమాస్టర్‌ను అడ్డగూడూరు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన మాలోతు దుర్గాప్రపాద్ అడ్డగూడూరు మండలం డి. రేపాక గ్రామ పోస్టుమాస్టర్‌గా 2022 నుంచి 2023 వరకు పనిచేశాడు. ఆ సమయంలో ఐదుగురు ఖాతాదారులు డిపాజిట్ చేసిన రూ.53వేల నగదను దుర్గాప్రసాద్ తన సొంతానికి వాడుకున్నాడు. 2025 మే నెలలో ఖాతాదారులు తమ ఖాతాల్లో డబ్బులు లేవని గుర్తించి దుర్గాప్రసాద్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేసి రామన్నపేట కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.