
టీడీ స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం చేసుకుంటున్న ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులను పర్యావరణ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం ఎంజీయూలో పర్యావరణ పరిరక్షణ, ఘన వ్యర్థాలు, పర్యావరణ పునరుద్ధరణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతేకాకుండా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన టీడీ స్వచ్ఛంద సంస్థతో ఎంజీయూ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. యువత పర్యావరణ పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించాలన్నారు. యూనివర్సిటీలోని బయోటెక్నాలజీ సోషల్ వర్క్, బయో కెమిస్ట్రీ కామర్స్, ఎకనామిక్స్ విద్యార్థులు తమ పరిశోధనలో పర్యావరణ అవసరాలను ఎంచుకోవాలన్నారు.
అనంతరం టీడీ సంస్థ డైరెక్టర్ ఉత్సవ్ ప్రధాన్ తమ సంస్థ ద్వారా విద్యార్థులతో చేపట్టనున్న కార్యక్రమాల ప్రణాళికను వివరించారు. నల్లగొండ జిల్లా హాలియా మండలం కొత్తపల్లిలో తమ సంస్థ చేపట్టిన పరిశోధన వివరాలతో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలో ప్లాస్టిక్ రహిత పట్టణాల కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంజీయూ ఇండస్ట్రీ అకడమిక్ సెల్ డైరెక్టర్ సురేష్‌రెడ్డి, మిర్యాల రమేష్, ప్రిన్సిపాల్ ప్రేమ్‌సాగర్, అధ్యాపకులు తిరుమల, రామచందర్‌గౌడ్, శివరాం, సమ్రిన్ కాజ్మి, మురళి పాల్గొన్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
కోదాడరూరల్: టీవీఎస్ ఎక్సెల్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ పట్టణ పరిధిలో మంగళవారం జరిగింది. చిలుకూరు మండలం సీత్లాతండాకు చెందిన ఇస్లావత్ హీరు(45) పని నిమిత్తం మంగళవారం టీవీఎస్ ఎక్సెల్‌పై కోదాడకు వస్తున్నాడు. హైదరాబాద్–విజయవాడ హైవేపై కోదాడ పట్టణంలోని హుజూర్‌నగర్ రోడ్‌లో ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్‌లో కట్టకమ్ముగూడెం క్రాసింగ్ వద్ద రోడ్డు దాటేందుకు వెళ్లాడు. అక్కడ క్రాసింగ్‌ను మూసివేయడంతో అదే మార్గంలో రాంగ్‌రూట్‌లో ఫైఓవర్ వైపు వస్తుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య శ్రీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బైక్ చక్రంలో చీరకొంగు చిక్కుకొని..
కిందపడిన తల్లి, కుమారుడు
చికిత్స పొందుతూ తల్లి మృతి
చౌటుప్పల్: బైక్ చక్రంలో చీరకొంగు చిక్కుకొని తల్లి, కుమారుడు రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తల్లి మృతిచెందింది. మంగళవారం చౌటుప్పల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి చెందిన బోయ సాయమ్మ(70), ఆమె కుమారుడు భిక్షం ఆదివారం చిన్నకొండూర్‌లో బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్లారు. అంత్యక్రియలు ముగిశాక ఇద్దరు కలిసి స్వగ్రామానికి బయల్దేరారు. చౌటుప్పల్ శివారులోని శ్రీని ఫార్మా కంపెనీ సమీపంలోకి రాగానే సాయమ్మ చీరకొంగు బైక్ వెనుక చక్రంలో చిక్కుకుంది. దీంతో బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో సాయమ్మ, భిక్షం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సాయమ్మ సోమవారం రాత్రి మృతిచెందింది. భిక్షం చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కోడలు బోయ అరుణ మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.