తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌ | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

Aug 13 2025 12:30 PM | Updated on Aug 13 2025 12:30 PM

తాళం

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

నకిరేకల్‌: పట్టపగలు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసి చోరీకు పాల్పడుతున్న యువకుడు, బాలికను నకిరేకల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల వివరాలను మంగళవారం సాయంత్రం నకిరేకల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 3వ తేదీన నకిరేకల్‌ పట్టణంలోని చీమలగడ్డలో పరడ సుమలత ఇంటి తాళం పగులగొట్టి గుర్తుతెలియని వ్యక్తులు ఆభరణాలు, నగదు చోరీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నకిరేకల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం నకిరేకల్‌ మండలం చందుపట్ల గ్రామ స్టేజీ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా.. స్కూటీపై ఓ యువకుడు, బాలిక తిప్పర్తి నుంచి నకిరేకల్‌ వైపు వస్తుండగా పోలీసులు వారిని ఆపి విచారించారు. యువకుడు కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామానికి చెందిన వల్లమల్ల ప్రదీప్‌కుమార్‌ అలియాస్‌ బంటిగా పోలీసులు గుర్తించారు. బాలిక ఏపీకి చెందినదిగా గుర్తించారు. ప్రదీప్‌ నార్కట్‌పల్లి మండలం కేంద్రంలో తన అమ్మమ్మ వద్ద ఉంటూ బాలికతో కలిసి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రదీప్‌కుమార్‌ గతంలో నకిరేకల్‌, శాలిగౌరారం, కట్టంగూర్‌, నల్లగొండ టౌన్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 14 దొంగతనాలకు పాల్పడి ఎనిమిది నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. జైలు నుంచి వచ్చాక ఏపీకి చెందిన బాలికతో పరిచయం పెంచుకుని, చెడు వ్యసనాలకు బానిసై మళ్లీ చోరీలు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. ఈ క్రమంలోనే వారిద్దరు కలిసి నకిరేకల్‌, కట్టంగూర్‌, చిట్యాల, నార్కట్‌పల్లి, నల్లగొండలో పట్టపగలు తాళం వేసిన ఇళ్లను ఎంచుకుని చోరీలు చేస్తున్నట్లు తమ విచారణలో తేలినట్లు డీఎస్పీ తెలిపారు. వారి నుంచి రూ.7.84లక్షల విలువైన ఐదు తులాల బంగారం, 119 తులాల వెండి ఆభరణాలు, రూ.45 వేల నగదు, స్కూటీ, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను పట్టుకున్న నకిరేకల్‌ సీఐ రాజశేఖర్‌, ఎస్‌ఐలు లచ్చిరెడ్డి, క్రిష్ణాచారి, పోలీస్‌ సిబ్బంది మధుకర్‌, వెంకటేశ్వర్లు, జనార్దన్‌, శ్రీకాంత్‌, శ్రీను, సురేష్‌, సుధాకర్‌, నాగర్జున, శ్రీనివాస్‌ను జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అభినందించి రివార్డులు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో శాలిగౌరారం సీఐ కొడల్‌రెడ్డి, నకిరేకల్‌ ఎస్‌ఐలు లచ్చిరెడ్డి, క్రిష్ణాచారి పాల్గొన్నారు.

ఫ చోరీలకు పాల్పడుతున్న

యువకుడు, బాలిక

ఫ ఇద్దరిని అరెస్ట్‌ చేసిన

నకిరేకల్‌ పోలీసులు

ఫ వివరాలు వెల్లడించిన

నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌1
1/1

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement