
గురుకుల వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది
కట్టంగూర్: రాష్ట్రంలో గురుకుల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను ఆయన సందర్శించి మధ్యాహ్న భోజనం, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాగునీరు, గదులకు కిటీకీలు, టాయిలెట్స్‌కు తలుపులు, భోజన సదుపాయాలు సక్రమంగా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో సీట్ల కోసం పోటీ ఉండేదని, నేడు గురుకుల విద్య అంటేనే భయపడే పరిస్థితికి వచ్చిందన్నారు. ప్రభుత్వం మెనూ విస్తరించిందని గొప్పలు చెప్పుకుంటున్నా గురుకులాల్లో అమలుకావడం లేదనన్నారు. భోజనంలో నాణ్యత లేక అనేక మంది విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములు, పెద్ది బాలనర్సింహ, దాసరి సంజయ్, రెడ్డిపల్లి మనోహర్, పోతరాజు నాగేష్ ఉన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య