
21న వలంటీర్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్: కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గుజరాత్‌లో జరిగే వెస్ట్ జోన్ ఎన్‌ఎస్‌ఎస్ ప్రీ రిపబ్లిక్ పరేడ్ క్యాంపునకు వెళ్లేందుకు గాను మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో అర్హులైన వలంటీర్లను ఈ నెల 21న ఎంపిక చేయనున్నట్లు ఎంజీయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ పసుపుల మద్దిలేటి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీలోని ఎన్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.
అదుపుతప్పిన స్కూల్ బస్సు
మోత్కూరు: స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన గోతిలోకి జారింది. ఈ ఘటన మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఆరెగూడెం రహదారిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. మోత్కూరు మండల కేంద్రంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలకు చెందిన బస్సు సుమారు 35 మంది విద్యార్థులతో ఆరెగూడెం మీదుగా పాలడుగుకు వెళ్తుండగా.. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన గోతిలోకి జారింది. భయాందోళనకు గురైన విద్యార్థులు ఎమర్జెన్సీ ద్వారం ద్వారా బస్సులో నుంచి కిందకు దిగారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.