
నాలుగు గేట్ల ద్వారా మూసీ నీటి విడుదల
కేతేపల్లి: హైదరాబాద్ నగరంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు మూసీ ప్రాజెక్టుకు 9,692 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. అధికారులు నాలుగు క్రస్టు గేట్లను ఐదు అడుగుల మేర పైకెత్తి 12,805 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 643.50 వద్ద నిలకడగా ఉంచి ఎగువ నుంచి వస్తున్న వరదనీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు. ఆయకట్టులో పంటల సాగుకు కుడి, ఎడమ ప్రధాన కాల్వలకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.0 టీఎంసీల నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు ఏఈ మధు తెలిపారు.