
విద్యార్థుల ప్రతిభకు ఉపకారం
తిరుమలగిరి (తుంగతుర్తి): ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్(ఎన్‌ఎంఎంఎస్)ను అమలు చేస్తోంది. 2025–26 విద్యాసంవత్సరానికి గాను ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ, ఏయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. చురుకుదనం, తెలివితేటలు, చదువుపై పట్టు ఉన్న విద్యార్థులు ఆర్థిక కారణాలతో చదువుకు దూరం కారాదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతి సంవత్సరం జిల్లాలో చాలా మంది విద్యార్థులు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. గతంలో ఈ స్కీమ్‌కు ఎంపికై న విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.6వేల చొప్పున 9, 10, ఇంటర్ మొదటి సంవత్సరం, ద్వితీయ సంవత్సరం కలిపి రూ.24 వేలను అందించేవారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాన్ని రెండింతలు చేసింది. ప్రతి సంవత్సరం కేటాయించే మొత్తాన్ని రూ.12వేలకు పెంచింది. అంటే 4 సంవత్సరాలకు కలిపి విద్యార్థులు రూ.48 వేలు అందుకోనున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు నవంబర్‌లో అర్హత పరీక్ష నిర్వహిస్తారు.
నిబంధనలు ఇవీ..
ఈ మెరిట్ స్కాలర్‌షిప్ కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అర్హులవుతారు. 7వ తరగతిలో ఓసీ, బీసీలు 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు పొంది తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు కలిగి ఉన్న వారు అర్హులు. పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పాటు ఆధార్, ఆదాయం, కులం, నివాస ధ్రువీకరణ పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 డీడీ బ్యాంకులో తీసి డీఈఓ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది.
31 వరకు ఎన్‌ఎంఎంఎస్
దరఖాస్తునకు గడువు