
నీరా కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాలి
భువనగిరిటౌన్ : గీత కార్మికుల ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి భువనగిరి మండలంలోని నందనం గ్రామంలో నిర్మించిన నీరా కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరిలో నిర్వహించిన కల్లుగీత సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న గీతకార్మికుల ఎక్స్‌గ్రేషియా డబ్బులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. తమ వృత్తిలో భాగంగా మృతిచెందిన, గాయపడిన 710 మంది కల్లుగీత కార్మికులకు మంజూరైన రూ.12.60కోట్ల ఎక్స్‌గ్రేషియా డబ్బులను సంవత్సరం గడిచినా చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొలగాని జయరాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో గీత కార్మికుల సంక్షేమానికి అనేక హామీలను ఇచ్చిందని, ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ఇప్పటివరకు వాటిని అమలు చేయడంలేదన్నారు. గీత కార్మికులను ఎలక్షన్ల సమయంలో కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా గీత కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదన్నారు. గీత కార్మికులకు పెన్షన్ రూ.4000 ఇవ్వాలని, మెడికల్ బోర్డు నిబంధనను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు నెమిలె మహేందర్, మద్దెల రాజయ్య, ధూపాటి వెంకటేష్, అంతటి అశోక్, బత్తిని భిక్షం, జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల భిక్షపతి, కోరుకొప్పుల కిష్టయ్య, జిల్లా కమిటీ సభ్యులు పాండాల మైసయ్య, మారగోని అశోక్, మారగోని శ్రీరామ్ మూర్తి, గడ్డమీది దశరథ, ఎర్ర రవీందర్, చెరుకు మల్లేశం, కొండం రఘురాములు, పాండవుల లక్ష్మణ్ ఉన్నారు.
కల్లుగీత కార్మిక సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ