
మేకలు, గొర్రెలు అపహరించేందుకు యత్నం
హుజూర్‌నగర్: గుర్తుతెలియని వ్యక్తులు మేకలు, గొర్రెలు అపహరించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన హుజూర్‌నగర్ మండలం గోపాలపురం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం గ్రామంలోని బూరుగడ్డ రోడ్డులో షేక్ నాగులమీరాకు చెందిన మేకలు, గొర్రెలను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వాహనంలో తరలించేందుకు యత్నించారు. ఈ క్రమంలో అలికిడి విని నాగుల్‌మీరా కుటుంబ సభ్యులు లేచి కేకలు వేయడంతో దొంగలు జీవాలను అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. గ్రామంలో గతంలో ఓ బైక్ కూడా చోరీకి గురైందని గ్రామస్తులు తెలిపారు. రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏఎస్‌ఐ బలరామిరెడ్డి తెలిపారు.
నిషేధిత పొగాకు
ఉత్పత్తులు స్వాధీనం
భువనగిరిటౌన్ : భువనగిరి పట్టణంలోని పాన్ షాపులు, కిరాణా దుకాణాల్లో సోమవారం భువనగిరి పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహించి నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా భువనగిరి పట్టణంలోని రామ్‌నగర్‌లో నివాసముంటున్న చిన్నం శ్రీశైలం ఇంట్లో భారీ ఎత్తున నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయించే వారి సమాచారం పోలీసులకు ఇస్తే.. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, లక్ష్మీనరసయ్య, నరేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.