
కోదాడ పట్టణంలో ట్రాఫిక్ జామ్
కోదాడరూరల్: కోదాడ పట్టణ పరిధిలోని హుజూర్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద సోమవారం ఉదయం భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలు.. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పరిధిలోని కొమరబండ వైజంక్షన్, కట్టకమ్ముగూడెం వద్ద రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో ఆ రెండు చోట్ల ఉన్న క్రాసింగ్‌లను పూర్తిగా మూసివేశారు. రెండు దారులను మూసివేయడంతో ఇటు కోదాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు, హైదరాబాద్ నుంచి కోదాడ పట్టణంలోకి వచ్చే వాహనాలు, ఖమ్మం వైపు నుంచి మిర్యాలగూడ వైపు వెళ్లే వాహనాలు అటువైపు నుంచి విజయవాడ ,హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులకు హుజూర్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద గల బ్రిడ్జినే ఏకై క మార్గం. దీంతో పాటు ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు కోదాడ పరిసర ప్రాంతాల నుంచి పట్టణంలోకి వచ్చేవారు, విద్యాసంస్థల వాహనాలన్నీ వచ్చిపోతుంటాయి. దీంతో హుజూర్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద కోదాడ వైపుతో పాటు హుజూర్‌నగర్, హైదరాబాద్ వైపు గల సర్వీస్ రోడ్‌లో భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పట్టణ, ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకొని దాదాపుగా గంటకు పైగా శ్రమించి వాహనాలను నెమ్మదిగా కదిలిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
హుజూర్‌నగర్ ఫ్లైఓవర్ వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు
ఇబ్బందులు పడిన వాహనదారులు