
మదర్ డెయిరీ నిర్వీర్యానికి కుట్ర
యాదగిరిగుట్ట: కాంగ్రెస్ ప్రభుత్వం మదర్ డెయిరీని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని బీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి ఆరోపించారు. యాదగిరిగుట్టలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఆరు బిల్లులు పెండింగ్ పెట్టడంతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన మదర్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే రూ.30 కోట్ల గ్రాంట్, రైతులకు ప్రోత్సాహక డబ్బులు విడుదల చేయిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పాడి రైతులను నమ్మించి ఓట్లు వేయించుకుని ఇప్పుడు మోసం చేశారని విమర్శించారు. నష్టాల ఊబిలో కూరుకుపోయి సంస్థ మునిగిపోయే స్థితిలో ఉందని.. అందుకు చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కారణమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి విజయ డెయిరీకి రూ.100 కోట్ల గ్రాంటు ఇచ్చారని, మదర్ డెయిరీకి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ రైతు సంక్షేమానికి, పాల ఉత్పత్తిదారులకు పెద్ద పీఠ వేశారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేస్తుందన్నారు. సంస్థ ఆస్తులను అమ్మడం కాదు.. లాభాల్లోకి తీసుకురావాలన్నారు. రేవంత్‌రెడ్డి మెడలు వంచైనా, కాళ్లు పట్టుకోనైనా పెండింగ్ బిల్లులు, బోనస్ తీసుకురావాల్సిన బాధ్యత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యదేనన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు పెండింగ్ పాల బిల్లులు ఇవ్వకుంటే రైతులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మదర్ డెయిరీ డైరెక్టర్లు కస్తూరి పాండు, కందాల అలివేలు రంగారెడ్డి, మాజీ డైరెక్టర్లు దొంతిరి సోమిరెడ్డి, ఒగ్గు భిక్షపతి, పాల సంఘం చైర్మన్లు సందిళ్ల భాస్కర్‌గౌడ్, మారెడ్డి కొండల్‌రెడ్డి, పుప్పాల సిద్ధులు, దడిగే మధు, సతీష్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు.
ఫ పెండింగ్ బిల్లులు, బోనస్ చెల్లించకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
ఫ బీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి