
సాహిత్య సమ్మేళనానికి హాజరైన వెల్దండి శ్రీధర్
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ) తెలుగు విభాగం అధ్యక్షుడు వెల్దండి శ్రీధర్ ఈ నెల 8, 9, 10 తేదీల్లో బెంగళూరులో జరిగిన బుక్ బ్రహ్మ దక్షిణ భారత సాహిత్య సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యం–తెలంగాణ ప్రత్యేకతలు అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ప్రముఖ విమర్శకులు కె. శ్రీనివాస్, సాహిత్య చరిత్రకారులు డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సీ్త్రవాద రచయిత్రి షాజహానతో కలిసి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. తెలంగాణ భాష, సంస్కృతి, మధ్యతరగతి ప్రజల జీవితాలను సురవరం ప్రతాపరెడ్డి, ధరణికోట శ్రీనివాసులు, నందగిరి వెంకటరావు వంటి వారు తమ కథల్లో అద్భుతంగా వివరించారని పేర్కొన్నారు. తర్వాత కాలంలో పెద్దింటి అశోక్‌కుమార్, బీఎస్ రాములు, కాలువ మల్లయ్య, బెజ్జరపు రవీందర్ లాంటి వాళ్లు మధ్యతరగతి జీవితాలను కథలుగా మలిచారని అన్నారు. 1980ల తర్వాత అనేక మంది బహుజన రచయితలు కథా రచనలోకి వచ్చి ఎన్నో మధ్యతరగతి కథలు రాశారని వివరించారు. ఈ సాహిత్య సమ్మేళనంలో పాల్గొన్న వెల్దండి శ్రీధర్‌ను ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ సముద్రాల ఉపేందర్, వైస్ ప్రిన్సిపాల్ పరంగి రవికుమార్, ఆర్ట్స్ వైస్ ప్రిన్సిపాల్ అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రణాధికారి బత్తిని నాగరాజు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ప్రసన్నకుమార్, అధ్యాపకులు అభినందించారు.