
కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలం
సూర్యాపేటటౌన్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి పాలన చేతకాకనే కాలం వెళ్లబుచ్చుతున్నాడన్నారు. రెండేళ్లు కావొస్తున్నా రేవంత్ బూతు పురాణాలు మానడం లేదన్నారు. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లే మాట్లాడుతున్నాడని, ప్రజలకు ఇచ్చిన హామీలను మరిపించేందుకు కొత్త నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఏ ఒక్క రంగంలో కూడా అడుగు ముందుకేసిన దాఖలాలు లేవని, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని కూడా కుంటుపట్టిస్తున్నారన్నారు. కొత్త ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. ఉన్న ఇళ్లే కూలగొట్టే పని చేపట్టారని, కొత్త ప్రాజెక్టుల మాట దేవుడెరుగు.. ఉన్న ప్రాజెక్టులను బంద్ పెట్టి పొలాలను ఎండబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ సహకారంతోనే కేసీఆర్‌పై కుట్రలు చేస్తోందని, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఇద్దరికీ కేసీఆరే ప్రధాన శత్రువు అన్నారు. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడని వాళ్లకు అర్థమైందన్నారు. స్ట్రీట్ ఫెలో స్టేట్ లీడర్ అయ్యాడని ఆయన విమర్శించారు. ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియని అజ్ఞాన కాంగ్రెస్ మంత్రులతో ఏం అభివృద్ధి సాధిస్తారని దుయ్యబట్టారు.
మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి