
పంచ జ్యోతిర్లింగాలకు 16న టూరిస్ట్ ట్రైన్
రామన్నపేట: పంచ జ్యోతిర్లింగ దర్శనయాత్ర నిమిత్తం ఈనెల 16న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరే భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్‌ను సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఐఆర్‌సీటీసీ అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్ర యంబకేశ్వర్, భీమశంకర్, గ్రిషనేశ్వర్‌ల దర్శనంకోసం రైల్వే శాఖ ట్రైన్ ఏర్పాటు చేసిందన్నారు. స్లీపర్ కోచ్ ఒకరికి రూ.14,700, త్రీ ఏసీ రూ.22,900 చొప్పున చార్జీలు చెల్లించాలని, భక్తులకు భోజన వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వివరాల కోసం 9701360701, 9281030711 నంబర్లను సంప్రదించాలని అసిస్టెంట్ మేనేజర్ కోరారు.
19 నుంచి సీపీఐ
రాష్ట్ర మహాసభలు
భువనగిరిటౌన్ : సీపీఐ రాష్ట్ర నాలుగో మహాసభలు ఈ నెల 19నుంచి 22వ తేదీ వరకు మేడ్చల్ జిల్లా గాజులరామారంలోని మహా రాజ గార్డెన్స్‌లో జరుగుతున్నాయని, ఎంపికై న ప్రతినిధులందరూ హాజరై విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో మహాసభలకు సంబంధించి పోస్టర్‌ను జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల పక్షాల నిలబడేది ఎర్రజెండా పార్టీ మాత్రమేనన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పేదల పక్షాన నిరంతర పోరాటాలు చేసిన ఘనత సీపీఐకే దక్కుతుందన్నారు. సీపీఐ వంద వసంతాల పండుగను డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలోసీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు కొల్లూరి రాజయ్య, కురిమిద్ద శ్రీనివాస్, ఎండీ ఇమ్రాన్, చెక్క వెంకటేష్, ఏశాల అశోక్, చిగుర్ల లింగం, మండల కార్యదర్శులు గాదేగాని మాణిక్యం, అన్నేమైన వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో హాజరుకావాలి
భువనగిరి: హైదరాబాద్ పబ్లిక్ స్కూళ్లలో ఒక టో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ఈనెల 12న కలెక్టరేట్‌లో డ్రా పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు గిరిజన శాఖ జిల్లా అభివృద్ధి అధికారి నాగిరెడ్డి తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సకాలంలో హాజరు కావాలని కోరారు.