
రెండు గంటలు ఏకధాటిగా..
గురువారం రాత్రి ముంచెత్తిన వాన
ఫ జిల్లాలో సగటున 11.21 సెంటీ మీటర్ల వర్షం
ఫ పొంగిపొర్లిన వాగులు, వంకలు
ఫ మూసీకి పోటెత్తిన వరద, లో లెవల్
వంతెనల పైనుంచి ప్రవాహం
ఫ రాకపోకలు నిలిపివేసిన అధికారులు
ఫ చెరువుల్లోకి చేరుతున్న నీరు
సాక్షి,యాదాద్రి: జిల్లాలోని పలు మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. 8 గంటల నుంచి 10 గంటల వరకు ఏకధాటిగా కురిసిన వానకు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మూసీకి వరద పోటెత్తింది. చెరువుల్లోకి నీరు చేరుతోంది. అత్యధికంగా ఆత్మకూర్ (ఎం) 159.5 మి.మీ, అడ్డగూడూరు 132.5 మి.మీ, వలిగొండ 108.7 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా సగటున 11.21 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. జూన్, జూలై మాసాల్లో సరైన వర్షాలు లేక భూగర్భజలాలు పడిపోయాయి. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. అన్ని పంటలు కలిపి 52 శాతానికి మించి సాగు కాలేదు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షం పంటలకు జీవం పోసింది.
ప్రమాదకరస్థాయిలో మూసీ
జిల్లాతో పాటు హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి, హిమాయత్‌సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో మూసీ పరవళ్లు తొక్కుతోంది. బీబీనగర్ –భూదాన్‌పోచంపల్లి మధ్య రుద్రవెల్లి వద్ద, వలిగొండ మండలం బొల్లేపలి – సంగెం మధ్యన లోలెవల్ వంతెనల పైనుంచి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేశారు. ఎగువనుంచి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థ్యాలు పెద్ద ఎత్తున కొట్టుకువచ్చి లోలెవల్ బ్రిడ్జిల వద్ద తూములకు అడ్డంకిగా మారాయి. అదే విధంగా మోటకొండూరు మండలం కొండాపురం–కాల్వపల్లి వద్ద బిక్కేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రైతులు, గీతకార్మికులు ప్రమాదకరంగా వాగును దాటుతున్నారు. మోత్కూరు పరిధిలో బిక్కేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. చౌటుప్పల్ మండలం నేలపట్ల–వర్కట్‌పల్లి మధ్య ఈదుల వాగుకు వరద ఉధృతి పెరగడంతో వాగుదాటుతున్న క్రమంలో కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అప్రమత్తమై సురక్షితంగా బయట పడ్డారు. స్థానికులు తాళ్ల సహాయంతో కారును బయటకు తీశారు.
సాధారణం కంటే అధిక వర్షం
ఈ సీజన్‌లోనే అధిక వర్షం కురిసింది. ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం 268 మి.మీ కాగా.. 353.7 మీ.మీ వర్షపాతం నమోదైంది. రెండు రోజుల్లోనే సాధారణం కంటే 32 మీ.మీ అధిక వర్షం కురిసింది. జిల్లాలో 17 మండలాలకు గాను 2 మండలాల్లో అత్యధికంగా, 7 మండలాల్లో అధికంగా, 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
అన్నదాతకు ఊరట
భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతకు ఊరటనిస్తున్నాయి. ప్రధానంగా వాగుల వెంట బోర్లు, బావుల్లో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో రైతులు దుక్కులు దున్నడం, నాట్లు వేస్తున్నారు. అదే విధంగా వర్షాలు పత్తి, ఇతర మెట్ట పంటలకు ప్రాణం పోశాయి. 1.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అధికారులు అంచనా వేయగా.. వర్షాభావ పరిస్థితుల కారణంగా 80 వేల ఎకరాలకే పరిమితమైంది. వర్షాలు లేక చేలు ఎదగడం లేదు. నష్టాలు తప్పవని భావిస్తున్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
వర్షపాతం (మి.మీ)
మండలం వర్షం
ఆత్మకూర్ (ఎం) 159.5
అడ్డగూడూరు 132.5
వలిగొండ 108.7
గుండాల 86.0
చౌటుప్పల్ 77.6
రామన్నపేట 69.9
మోత్కూరు 67.1
మోటకొండూరు 60.3
నారాయణపురం 55.3
భువనగిరి 51.2
అలేరు 47.1
రాజాపేట 40.9
పోచంపల్లి 39.5
బి.రామారం 39.3
బీబీనగర్ 32.8
తుర్కపల్లి 29.5
యాదగిరిగుట్ట 23.8

రెండు గంటలు ఏకధాటిగా..

రెండు గంటలు ఏకధాటిగా..

రెండు గంటలు ఏకధాటిగా..