
వర్షాలతో అన్ని రకాల పంటలకు మేలు
భువనగిరి : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో వరి, పత్తి, కందితో పాటు మిగతా అన్ని రకాల పంటలకు మేలు చేకూరుతుందని జిల్లా ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా నమోదైందన్నారు. వివిధ దశల్లో ఉన్న పంటలకు ఈ వర్షాలు ఎంతో దోహదపడుతాయన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత ఎరువులు పెట్టాలని రైతులకు సూచించారు. భూగర్భ జలాలు వృద్ధి చెంది వరి సాగుకు అనుకూలత ఏర్పడనుందన్నారు.
డబ్బులు రికవరీ, కేసు నమోదు
మోత్కూరు : తప్పుడు పత్రాలతో కల్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధిపొందిన వ్యక్తుల నుంచి డబ్బులు రికవరీ చేయడంతో పాటు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన వల్లపు సోమలక్ష్మి–స్వామి దంపతుల కుమార్తె రాధికను 2011లో వలిగొండ మండలం మొగిలిపాకకు చెందిన మర్ల మహేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఆ తరువాత వివాహం జరిగినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి రూ.1,00,116 లబ్ధి పొందారు. విచారణలో వాస్తవమని తేలడంతో తహసీల్దార్ జ్యోతి ఫిర్యాదు మేరకు నలుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వారి నుంచి నగదు రికవరీ చేసినట్లు తహసీల్దార్ వెల్లడించారు.
నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం నిత్యారాధనలో భాగంగా ఆండాళ్‌దేవికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవ నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చనలు, ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణ వేడుక తదితర పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
నూతన డ్రెయినేజీలు నిర్మిస్తాం
యాదగిరిగుట్ట: పట్టణంలో డ్రెయినేజీ సమస్యపై ‘మురుగుతో అవస్థలు’ శీర్షికతో ఈనెల 7న సాక్షిలో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. కమిషనర్ లింగస్వామి, శానిటరీ ఇన్స్‌పెక్టర్ దండు కిరణ్‌బాబు శుక్రవారం అధ్వానంగా మారిన డ్రెయినేజీలు, కూలిపోయిన డ్రెయినేజీలను పరిశీలించారు. చెత్తాచెదారం తొలగించడంతో పాటు బ్లీచింగ్ చల్లించారు. దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వదిలారు. కూలిపోయిన డ్రెయినేజీలతో స్థానంలో, అవసరమైన చోట టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో నూతన డ్రెయినేజీలు నిర్మిస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూని వర్సిటీ పరిధిలోని పీజీ రెండో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలను అధికారులు తనిఖీ చేశారు. యూనివర్సిటీలో పరీక్ష కేంద్రాలను వైస్ చాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఓఈ జి.ఉపేందర్‌రెడ్డి పర్యవేక్షించారు.

వర్షాలతో అన్ని రకాల పంటలకు మేలు

వర్షాలతో అన్ని రకాల పంటలకు మేలు