
ఒక్క జత యూనిఫాంతోనే బడికి
భువనగిరి: విద్యార్థులకు ఒక జత యూనిఫాం అందజేసిన సర్కారు.. రెండోది పంపిణీ చేయడంలో జాప్యం చేస్తోంది. విద్యా సంవత్సరం పునఃప్రారంభం రోజునే రెండు జతల యూనిఫాం, పుస్తకాలు అందజేయాల్సి ఉంది. కానీ, విద్యార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఒక రోజు యూనిఫాం వేసుకొస్తే మరుసటి రోజు సివిల్ డ్రెస్‌తో పాఠశాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
వస్త్రం ఆలస్యంతోనే..
ప్రభుత్వం ఏటా రెండు జతల యూనిఫాం విద్యార్థులకు పంపిణీ చేస్తుంది. మే నెలలోనే రెండు జతల యూనిఫాంకు వస్త్రం సరఫరా చేయాలి. కానీ, పూర్తిస్థాయిలో వస్త్రం రాకపోవడంతో పాఠశాలల పునఃప్రారంభం రోజున ఒకే జత అందజేశారు. రెండో జతకు సైతం వస్త్రం అలస్యంగా రాగా.. అది కూడా సగమే సరఫరా చేశారు. ఈ నెలాఖరు నాటికి రెండో జత యూనిఫాం అందజేస్తామని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం మహిళా సంఘాల ద్వారా యూనిఫాం కుట్టే ప్రక్రియ కొనసాగుతోంది.
43,188 మంది విద్యార్థులు
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 715 ఉన్నాయి. వీటిలో 43,188 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా 55 రోజులుగా ఒకే జత యూనిఫాంతో పాఠశాలకు హాజరవుతున్నారు. పంద్రాగస్టుకు పాత యూనిఫాంతో హాజరుకావాల్సి వస్తుంది.
ఫ రెండో జత పంపిణీలో జాప్యం
ఫ మూడు నెలలుగా విద్యార్థుల ఎదురుచూపులు
ఫ పంద్రాగస్టుకు పాత యూనిఫాంతోనే పాఠశాలకు..
ఈ నెలాఖరులో పంపిణీ చేస్తాం
మొదటి జత యూనిఫాం పాఠశాలల పునఃప్రారంభం రోజునే ఇచ్చాం. రెండో జత కూడా ఈ నెలాఖరులో పంపిణీ చేస్తాం. వస్త్రం సగం వచ్చి మిగతా సగం అలస్యంగా రావడంతో రెండో జత పంపిణీలో జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో యూనిఫాం కుట్టే ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తి కాగానే వెంటనే విద్యార్థులకు పంపిణీ చేస్తాం.
–సత్యనారాయణ, డీఈఓ