
42 శాతం రిజర్వేషన్లపై సీపీఎం దీక్ష.. భగ్నం
భువనగిరిటౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌తో శుక్రవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరిలోని ప్రిన్స్ చౌరస్తాలో చేపట్టిన పార్టీ నాయకులు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టెంట్‌ను తొలగించడంతో పాటు నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్ తరలించారు. అనంతరం వారిని వ్యక్తిగత పూచికత్తుపై వదిలిపెట్టారు. అక్కడి నుంచి వచ్చి సీపీఎం కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జహంగీర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ బిల్లు చట్టబద్ధత పొందాలంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చించి చట్టరూపంలోకి తీసుకురావాల్సిన బాధ్యత బీజేపీదేనని, తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకపక్షంగా వెళ్లకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. పోలీసుల తీరును వారు ఖండించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, కొండమడుగు నరసింహ, నాయకులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కష్ణారెడ్డి, జెల్లెల పెంటయ్య, సిర్పంగి స్వామి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, బోలగాని జయరాములు, బొల్లు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

42 శాతం రిజర్వేషన్లపై సీపీఎం దీక్ష.. భగ్నం