
అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి
భూదాన్‌పోచంపల్లి: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మూసీ పరివాహక మండలాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు.శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు – రుద్రవెల్లి గ్రామాల మధ్య మూసీని పరిశీలించారు.లోలెవల్ బ్రిడ్జిపై పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్తను తొలగించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఈ సీజన్‌లోనే గురువారం భారీ వర్షం కురిసిందని, ఆత్మకూర్(ఎం)లో 152 మి.మీ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందన్నారు. గడిచిన రెండు రోజుల్లో కురిసిన వర్షాలతో లోటు నుంచి 32 శాతం అధికంలోకి వచ్చామన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నందున మూసీ పరిహకంలోని పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ మండలాల అధికారులను అలర్ట్ చేశామని, లోలెవల్ బ్రిడ్జిలపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు సాగించకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు.
సీజనల్ వ్యాధులపట్ల జాగ్రత్త
సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రజలు కాచి వడగట్టిన నీటిని తాగాలని కలెక్టర్ సూచించారు. దోమలు వృద్ధి చెందకుండా నీరునిల్వ ఉన్న ప్రదేశాల్లో ఆయిల్‌బాల్స్ వేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన భవనాల్లో విద్యార్థులను కూర్చొబెట్టవద్దని, అవసరమైతే స్కూల్‌కు ఒక రోజు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. మట్టి గోడలున్న ఇళ్లలో నివసించవద్దని, వర్షాలు తగ్గేవరకు పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ భవనాల్లో తాత్కాలికంగా ఆవాసం ఉండాలని సూచించారు. ఆయన వెంట డిటీ నాగేశ్వర్ రావు, ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు