
నులిపురుగుల నివారణతో ఆరోగ్యం
భువనగిరి: ఆల్బెండజోల్ మాత్రల పంపిణీకి వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 11వ తేదీన 1 నుంచి 19 ఏళ్ల వయస్సులోపు వారికి మాత్రలు పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,43,789 మందిని గుర్తించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు మాత్రలు వేస్తారు. 1.75 లక్ష ఆల్బెండజోల్ మాత్రలు అందుబాటులో ఉంచారు. మొదటిరోజు మిగిలిపోయిన వారికి 18న పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఎంపీహెచ్‌ఏలు 246, ఆశ వర్కర్లు 690, అంగన్‌వాడీ టీచర్లు 843, ర్యాపిడ్ టీంలు 24 ఏర్పాటు చేశారు. 1,2 ఏళ్ల వయస్సున్న పిల్లలకు సగం టాబ్లెట్ వేయనున్నారు. వైద్యారోగ్య శాఖ గుర్తించిన ప్రతి ఒక్కరూ ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని డీఎంహెచ్‌ఓ మనోహర్ తెలిపారు.
వ్యాధి వ్యాప్తి ఇలా..
బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన, అపరిశుభ్ర వాతావరణం, మట్టిలో ఆటలు, చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం చేయడం వల్ల నులిపురుగుల బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధి బారిన పడిన పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం, కడుపు నొప్పి, బరువు తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు ఏర్పడుతాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఆగస్టులో ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తారు.
ఫ 11న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
ఫ 1,43,789 మంది గుర్తింపు