చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలం
హుజూర్‌నగర్ : చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) గృహ విజ్ఞాన శాస్త్రవేత్త సుగంధి అన్నారు. శుక్రవారం కేవీకే ఆధ్వర్యంలో చిరుధాన్యాల ప్రాముఖ్యత, వాటి ఆహార ఉత్పత్తులు, పెరటి తోటల పెంపకంపై హుజూర్‌నగర్ మెప్మా కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా చిరుధాన్యాలతో వివిధ రకాల ఉత్పత్తులు అయిన రాగి, జొన్న లడ్డూ, బిస్కెట్లు, మురుకులు ఏ విధంగా తీసుకోవాలని వివరించారు. వీటిని మార్కెట్ చేసుకుని స్వయం ఉపాధిని ఎలా పొందవచ్చో తెలిపారు. మనకు కావాల్సిన సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, మినరల్స్ కూరగాయల్లో ఎక్కువగా ఉంటాయని, వాటి ద్వారా పోషకాహార లోపాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా యోగా ప్రాముఖ్యత, ఔషధ మొక్కల ఉపయోగాలను ఆయుష్ డిపార్ట్‌మెంట్ యోగా ఇన్‌స్ట్రక్టర్ రామాంజి రెడ్డి వివరించారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారి మహేష్, మెప్మా ఏడీఎంసీ వసంత కుమార్, సీఓ సాయికృష్ణ, కనకదుర్గ, సుజాత, నాగమణి, స్వయం సహాయ సంఘాల, సమభావన సంఘాల మహిళలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


