సేంద్రియ వ్యవసాయంపై ఉచిత శిక్షణ
గరిడేపల్లి: కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లిలో నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ హైదరాబాద్ వారి ఆర్థిక సహకారంతో జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు 40 మంది షెడ్యూల్డ్(ఎస్సీ) కులాల యువతకు, రైతులకు సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కేవీకే సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ ఇన్‌చార్జ్ నరేష్ మంగళవారం తెలిపారు. ఆసక్తి కలిగిన షెడ్యూల్డ్ కులాల యువత, రైతులు తమ పేరు, గ్రామం, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం జతచేస్తూ కేవీకేలో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు భోజన, రవాణా చార్జీల సదుపాయం ఉంటుందని తెలిపారు. రైతులు ఆధార్‌కార్డు, పట్టా పాస్‌పుస్తకం జీరాక్స్ కాపీలను జతచేయాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు మృత్తిక శాస్త్రవేత్త కిరణ్ సెల్‌నంబర్ 78939 89055ను సంప్రదించాలని కోరారు.
భూవివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాతర్లపహాడ్ గ్రామంలో భూవివాదం నేపథ్యంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన కుంచం చినమైసయ్యకు, అతడి అన్న కుమారులు కుంచం సైదులు, కుంచం రవి మధ్య కొంతకాలంగా భూ తగాదాలు జరుగుతున్నాయి. పెద్ద మనుషుల సమక్షంలోనూ వివాదం పరిష్కారం కాకపోగా మంగళవారం ఉదయం కుంచం సైదులు కుటుంబ సభ్యులు చినమైసయ్య ఇంటి వద్దకు వెళ్లారు. భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో ఇరువురి కుటుంబ సభ్యులు కర్రలతో దాడులు చేసుకున్నారు. దీంతో కుంచం చిన మైసయ్య, అతడి భార్య వెంకటమ్మతోపాటు, కుంచం సైదులు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ తెలిపారు.
పేలుడు పదార్థాలు
తరలిస్తున్న ముగ్గురి రిమాండ్
శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పత్తిపాక సమీపంలో సోమవారం పేలుడు పదార్థాలు తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై జక్కుల పరమేష్ మంగళవారం తెలిపారు. ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తంగెళ్ల బ్రహ్మం వద్ద పేలుడు పదార్థాలను యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బొంత శ్రీను, అతని బంధువులు ఇరుగదిడ్ల శివశంకర్, బొంత అజయ్‌లు రూ.11వేలకు కొనుగోలుచేశారు. వాటిని శాయంపేట మండలం వసంతాపూర్ గ్రామానికి చెందిన చల్ల రాజిరెడ్డికి ఇచ్చేందుకు వెళ్తున్నారు. సోమవారం పత్తిపాక శివారులో సిబ్బందితో కలిసి ఎస్సై పెట్రోలింగ్ చేస్తుండగా.. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారి వద్ద ఉన్న సంచిని పరిశీలించగా.. అందులో పేలుడు పదార్థాలు లభించగా.. వాటిని స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
స్టేషన్ ఆవరణలో మహిళా కానిస్టేబుల్ రీల్స్
ఆత్మకూరు(ఎం) : పోలీస్ స్టేషన్ ఆవరణలో యునిఫాంలో ఉన్న మహిళా కానిేస్టేబుల్ చేసిన రీల్స్ మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రేమలత రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తుంటుంది. మంగళవారం యునిఫాంలో ఉండి పోలీస్ స్టేషన్ ఆవరణ, స్టేషన్ లోపల చేసిన రీల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విషయమై స్టేషన్ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఏఎస్‌ఐ సైదులు కానిస్టేబుల్ ప్రేమలతను ప్రశ్నించినట్లు తెలిసింది.


