ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్
రామగిరి(నల్లగొండ): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆన్‌లైన్ పేమెంట్ల దిశగా అడుగులు వేస్తోంది. గతంలో ఆర్టీసీ బస్సులో వాడుతున్న టికెట్ ఇష్యూయింగ్ మిషన్ (టిమ్)తో చిల్లర సమస్య తలెత్తేది. ఈ సమస్యలను అధిగమించేందుకు నూతనంగా ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్లు (ఐ టిమ్స్) ప్రవేశపెట్టనుంది. నల్లగొండ రీజియన్ వ్యాప్తంగా ఏడు డిపోలు ఉన్నాయి. అన్ని డిపోల్లో టికెట్ ఇష్యూయింగ్ మిషన్ (టిమ్)తో పాటు కొత్తగా ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్లు త్వరలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే సిస్టమ్ సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఏడు డిపోలు ఉండగా అన్ని డిపోల్లో 600 ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్లు అందుబాటులోకి తీసుకురానున్నారు.
నగదు రహిత సేవలు..
జిల్లాలో ప్రయోగాత్మకంగా ముందుగా దేవరకొండ డిపో పరిధిలో 10 ఈ టిమ్స్ మిషన్లను ప్రవేశపెట్టింది. దీంతో పాటు సూర్యాపేట, కోదాడ డిపోల్లో దూర ప్రయాణం చేసే బస్సుల్లో ఈ మిషన్లు వాడుతున్నారు. వీటితో నగదు రహిత సేవలు అందించేందుకు వీలు ఉంది. ఈ మిషన్ల ద్వారా ప్రయాణికులు యూపీఐ ద్వారా గూగుల్ పే, ఫోన్ పేతో పాటు ఏటీఎమ్ కార్డు స్వైపింగ్ తో డబ్బులు చెల్లించి టికెట్ పొందే అవకాశం ఉంది. ఈ టీమ్ సేవలను త్వరలో దశలవారీగా ఇతర బస్సుల్లో కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రయాణికులకు తప్పనున్న ఇబ్బందులు
కండక్టర్ వద్ద చిల్లర లేని సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేది. గమ్య స్థానంలో దిగేటప్పుడు ఇద్దరు, ముగ్గురు ప్రయాణికులకు కలిపి డబ్బులు ఇచ్చేవారు. ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్లతో చిల్లర సమస్యకు చెక్ పడనుంది.
అందుబాటులోకి రానున్న ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్లు (ఐటిమ్స్)
ప్రయాణికులకు
తొలగనున్న చిల్లర సమస్య
జిల్లాకు 600 ఐ టిమ్స్ మంజూరు
ఇప్పటికే సిస్టమ్ సూపర్‌వైజర్లకు శిక్షణ
సేవలు వేగవంతం అవుతాయి
ఆర్టీసీ బస్సుల్లో ఇంటెలిజెన్స్ టికెట్ ఇష్యూయింగ్ మిషన్లు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. ఉమ్మడి నల్లగొండ రీజి యన్ వ్యాప్తంగా అన్ని డిపోల్లో మిషన్ల ద్వారా సేవలు అందిస్తాం. యూపీఐ, ఏటీఎం కార్డు ద్వారా టికెట్ తీసుకునే సదుపాయం ఉంది. ఈ మిషన్ ద్వారా బస్సు ప్రయాణించే సమయంలో కూడా సీట్లు ఖాళీగా ఉంటే టికెట్ తీసుకునే సదుపాయం ఉంది. ఆర్టీసీ లావాదేవీలు ఎప్పటికప్పుడు తెలిసిపోతాయి.
– జానిరెడ్డి, రీజినల్ మేనేజర్
రీజియన్‌లో డిపోల
వారీగా మిషన్ల వివరాలు
డిపో టిమ్‌ల సంఖ్య కోదాడ 80
నార్కట్‌పల్లి 15
మిర్యాలగూడ 135
దేవరకొండ 90
నల్లగొండ 115
సూర్యాపేట 95
యాదగిరిగుట్ట 70
ఆర్టీసీ బస్సుల్లో ఆన్‌లైన్ పేమెంట్


