కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోటీచేస్తే ప్రతిపక్షాలు ఉండవు
మునుగోడు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలల్లో కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీచేస్తే మునుగోడు నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలు కనుమరుగు కావడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికై న నెల్లికంటి సత్యంకు ఆదివారం మునుగోడులో నిర్వహించిన అభినందన సభకు రాజగోపాల్‌రెడ్డి హాజరై మాట్లాడారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా మునుగోడు, కొత్తగూడెం స్థానాలను కాంగ్రెస్ పార్టీ సీపీఐకి కేటాయించిదన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండగా.. బీజేపీతో ఉన్న తాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కోరిక మేరకు కాంగ్రెస్‌లో చేరడంతో తనకు మునుగోడు టికెట్ ఇచ్చిందన్నారు. ఆ సమయంలో సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్న నెల్లికంటి సత్యంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, అలాగే తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని.. ఈ మేరకు సత్యంకు ఎమ్మెల్సీ ఇచ్చిందన్నారు. ఈ ప్రాంతం పట్ల అవగాహన కలిగిన సత్యం ఎమ్మెల్సీగా ఎన్నికకావడం ఆనందంగా ఉందన్నారు. తామిద్దరం కలిసి మునుగోడుని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభత్వం మునుగోడుని పూర్తిగా విస్మరించినదని, దీంతో నేటికీ ఈ ప్రాంతంలో సాగునీరు సౌకర్యం కరువైందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన వారికే కాంగ్రెస్ హయాంలో పదవులు ఇచ్చారన్నారు. చర్లగూడెం, కిష్టరాయిన్‌పల్లి రిజర్వాయిర్ పనులను పూర్తిచేయించి ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామన్నారు. ఎమ్మెల్సీ సత్యం మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ పదవులు ఆశించలేదని, నిత్యం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాదయాత్రలు, ఆందోళనలు చేస్తూ ప్రజల కోసమే పనిచేశానన్నారు. ఎమ్మెల్సీ పదవిని ఒక బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డితో కలిసి మునుగోడును రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. అనంతరం సత్యంను పూలమాల, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, సీపీఐ జిల్లా నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్, గుర్జ రామచంద్రం, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిథులు పాల్గొన్నారు.
ఫ మునుగోడు ఎమ్మెల్యే
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడింది
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి సీపీఐకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. అభినందన సభలో వెంకట్‌రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ సీపీఐకి ఎమ్మెల్సీ పదవితోపాటు రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మునుగోడు అభివృద్ధికి దోహదపడాలని కోరారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన సత్యం, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఐక్యంగా పనిచేస్తూ వెనుకబడిన మునుగోడు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అన్నారు.


