రాష్ట్ర మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో ప్రతిభ

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

రాష్ట్ర మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌లో ప్రతిభ వెంకన్న అన్నదానానికి రూ.2,11,116 విరాళం పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన హెల్మెట్‌ ధారణపై అవగాహన

భీమవరం: రాష్ట్ర మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న యాతం నాగబాబు మూడు బంగారు పతకాలు సాధించారు. ఈ నెల 14 నుంచి రెండు రోజుల పాటు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన 46వ రాష్ట్ర మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ పోటీల్లో ఆయన పాల్గొన్నారు. 200, 400, 800 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచి మూడు బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. అలాగే, 4 ఇన్‌టూ 100 మీటర్ల రిలే పరుగు పందెంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకున్నారు. ఈ విజయంతో ఆయన వచ్చే ఏడాది జనవరిలో గుజరాత్‌లోని హిమాయత్‌ నగర్‌లో జరిగే 46వ జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం నాగబాబును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టరు ఎం. రవిబాబు అభినందించారు.

ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి నిత్యాన్నదానానికి ఆకివీడుకు చెందిన గొంట్ల గోపాల వీవీ లక్ష్మీనరసింహారావు, కుటుంబ సభ్యులు మంగళవారం రూ.2,11,116 విరాళం సమర్పించారు. వీరు స్వామిని దర్శించిన అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే దాతలకు ఆలయ పర్యవేక్షకుడు పులపర్తి రాంబాబు స్వామి చిత్రపటం అందించారు.

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్ట్‌ పనులు వేగవంతంగా, అత్యుత్తమ నాణ్యతతో జరుగుతున్నాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈఓ సంజీవ్‌ వోహ్రా అన్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాజెక్ట్‌ పనులను సమగ్రంగా సమీక్షించిన ఆయన, క్షేత్రస్థాయిలో పనుల తీరును పరిశీలించి అక్కడికక్కడే నాణ్యత పరీక్షలు నిర్వహించారు. తొలుత ప్రాజెక్ట్‌ సమావేశ మందిరానికి చేరుకున్న వోహ్రా, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురామ్‌, చీఫ్‌ ఇంజనీర్‌ ఎం. రమేష్‌ కుమార్‌.. జలవనరుల శాఖ అధికారులు, మేఘా ఇంజనీరింగ్‌ (ఎంఈఐఎల్‌) ప్రతినిధులతో సమీక్షించారు.

భీమవరం: ‘హెల్మెట్‌ ధరించి ప్రయాణం చేద్దాం, ప్రాణాలను రక్షించుకుందాం’ అనే నినాదంతో భీమవరం పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ ఎంతగానో ఆకట్టుకుంది. పట్టణంలోని జువ్వలపాలెం రోడ్డు అడ్డవంతెన వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, భీమవరం డివిజన్‌ పోలీస్‌ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ర్యాలీని జిల్లా అడిషనల్‌ ఎస్పీ బి. విశ్వనాధ్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోటార్‌ సైకిల్‌ నడిపేటప్పుడు హెల్మెట్‌ ధరించడం వల్ల ప్రమాద సమయంలో ప్రాణాలతో బయటపడవచ్చని అన్నారు. డీఎస్పీ రఘువీర్‌ విష్ణు మాట్లాడుతూ, ట్రాఫిక్‌ అవేర్నెస్‌ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి నెలా అన్ని శాఖల ఉద్యోగులు, పోలీస్‌ సిబ్బందితో అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. అడ్డవంతెన వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ అభిరుచి సెంటర్‌, బొంబే స్వీట్స్‌ సెంటర్‌, అంబేద్కర్‌ సెంటర్‌, ప్రకాశం చౌక్‌, లక్ష్మీటాకీస్‌ సెంటర్‌ మీదుగా ఆదివారం బజార్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం, తహసీల్దార్‌ కార్యాలయం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో సీఐలు పి. మురళీకృష్ణ, జి. కాళీ చరణ్‌, జగదీశ్వరరావు, శ్రీనివాసరావు, అవేర్నెస్‌ ప్రోగ్రాం కన్వీనర్‌ భూపతిరాజు సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement