గడువు ముగిశాక నామినేషన్‌ స్వీకరణపై నిరసన | - | Sakshi
Sakshi News home page

గడువు ముగిశాక నామినేషన్‌ స్వీకరణపై నిరసన

Nov 18 2026 1:14 AM | Updated on Nov 18 2026 1:14 AM

గడువు ముగిశాక నామినేషన్‌ స్వీకరణపై నిరసన

పెనుమంట్ర: ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి, సమయం ముగిసిన తర్వాత కూడా నామినేషన్‌ స్వీకరించారంటూ మార్టేరు గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. మార్టేరు, నెగ్గిపూడి పంచాయతీల రిటర్నింగ్‌ అధికారి ధనరాజు, నెగ్గిపూడి కార్యదర్శి ఎస్‌. రాజేశ్వరి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నెగ్గిపూడి పంచాయతీ 6వ వార్డుకు వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడు దుంగ శ్రీనివాసరావు ఒక్కరే నామినేషన్‌ వేశారు. మంగళవారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఆయన ఒక్కరే బరిలో ఉన్నారని అధికారులు చెప్పడంతో, ఎన్నిక ఏకగ్రీవమైందని భావించి శ్రీనివాసరావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే తుది జాబితా ప్రకటించే సమయంలో అదే వార్డుకు షేక్‌ మహమ్మద్‌ అలీ అనే వ్యక్తి కూడా నామినేషన్‌ వేసినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన మాజీ సర్పంచ్‌ అల్లం భాస్కర్‌ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కీర్తి కనకయ్య, ఇతర నాయకులు మార్టేరు సచివాలయానికి చేరుకుని అధికారులను నిలదీశారు. స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఆవరణలోనే నేలపై కూర్చుని ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పెనుమంట్ర ఎస్సై స్వామి అక్కడికి చేరుకుని నిరసనకారులతో చర్చించారు. అక్రమాలు జరిగాయని భావిస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, విచారణలో బాధ్యులపై చర్యలు ఉంటాయని నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఈ నిరసనలో సత్తి వెంకటరెడ్డి, అల్లం బాలసాయిరెడ్డి, సత్య విష్ణు కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement