సాక్షి, భీమవరం: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. తాడేపల్లిగూడెం డివిజన్‌లోని 121 పంచాయతీలు, వాటి పరిధిలోని 1,286 వార్డులకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలిదశలోని పంచాయతీల్లో మంగళవారంతో నామినేషన్లకు గడువు ముగిసింది. జిల్లాలో 393 పంచాయతీలు, 4206 వార్డులకు గాను తొలి దశగా నరసాపురం డివిజన్‌లో 90 పంచాయతీలు, 1006 వార్డుల్లో ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రెండో దశకు తాజాగా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తాడేపల్లిగూడెం డివిజన్‌లోని ఆరు మండలాల పరిధిలోని 121 పంచాయతీలు, 1286 వార్డులకు బుధవారం నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది. నేటి నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 21న పరిశీలన, 22న తిరస్కరించిన వాటిపై అప్పీళ్లకు అవకాశం, 23న అప్పీళ్ల పరిష్కారం, 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు విత్‌డ్రాలకు అవకాశం, అనంతరం పోటీలోని అభ్యర్థుల జాబితా ప్రకటన, 29వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్, మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్లు లెక్కింపు చేయనున్నారు. ఎన్నికల కోసం 1,372 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆయా మండలాల్లోని ఎంపిక చేసిన మేజర్ పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు.
తొలి దశకు ముగిసిన తొలి అంకం
తొలి దశలో ఎన్నికలు జరుగుతున్న పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. రెండు రోజుల్లో పంచాయతీల కోసం 427 నామినేషన్లు రాగా పంచాయతీలకు వార్డుల కోసం 1,561 నామినేషన్లు వచ్చాయి. చివరి రోజున పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులుగా 133, వార్డుల కోసం 971 నామినేషన్లు వచ్చాయి. మూడు రోజుల్లో 90 పంచాయతీలకు మొత్తం 560 , 1006 వార్డులకు 2533 నామినేషన్లు వచ్చాయి. వీటిలో ఆచంటలో 12 పంచాయతీలకు సర్పంచులుగా 87 నామినేషన్లు రాగా, మొగల్తూరులో 17 పంచాయతీలకు 136, నరసాపురంలో 28 పంచాయతీలకు 153, పెనుగొండలో 15 పంచాయతీలకు 90, పెనుమంట్రలో 18 పంచాయతీలకు 94 నామినేషన్లు వచ్చాయి. నేడు పరిశీలన, 21 వరకు ఉపసంహరణ గడువు, 26న పోలింగ్, అదే రోజున కౌంటింగ్ జరుగనున్నాయి.
తాడేపల్లిగూడెం డివిజన్‌లో 121 పంచాయతీలు, 1,286 వార్డులకు ఎన్నికలు
నేటి నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ
29న పోలింగ్
తొలిదశ 90 పంచాయతీల్లో నామినేషన్లకు ముగిసిన గడువు
మండలం పంచాయతీలు
అత్తిలి 18
గణపవరం 25
మండలం పంచాయతీలు
ఇరగవరం 21
పెంటపాడు 21
మండలం పంచాయతీలు
తాడేపల్లిగూడెం 27
తణుకు 9


