లింగపాలెం: గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు గుర్తించామని, పరిసర గ్రామాల ప్రజల భద్రత దృష్ట్యా ముందస్తు హెచ్చరిక జారీ చేస్తున్నట్లు జిల్లా అటవీశాఖాధికారి (డీఎఫ్ఓ) పి.వి. సందీప్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే స్థానిక రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అన్ని విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. అటవీ రేంజ్ అధికారి (ఎఫ్ఆర్ఓ) ఆధ్వర్యంలో సిబ్బంది నిరంతరం ఆ ప్రాంతంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పెద్దపులి కదలికలను ఖచ్చితంగా గుర్తించేందుకు వైర్లెస్ రేడియో ఫ్రీక్వెన్సీ (వీహెచ్ఎఫ్) పరికరాల ద్వారా నిరంతర ట్రాకింగ్ నిర్వహిస్తున్నారు. పులికి ఎటువంటి హాని కలగకుండా సురక్షితంగా మత్తుమందు ఇచ్చి బంధించేందుకు పుణే నుంచి ప్రత్యేక నిపుణుల రెస్క్యూ బృందాన్ని రప్పించామని, వారు అవసరమైన పరికరాలతో బయలుదేరి వస్తున్నారని డీఎఫ్ఓ తెలిపారు. పెద్దపులి ఉన్న పొలం వైపు, చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రజలు, యువకులు గుంపులుగా వెళ్లడం, చూడటానికి ప్రయత్నించడం పూర్తిగా నిషేధించారు. పులిని బెదిరించడం, కేకలు వేయడం, రాళ్లు విసరడం వంటివి చేస్తే అది ఆందోళన చెంది జనావాసాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు పొలాల వైపు వెళ్లవద్దని కోరారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాలను, పాత వీడియోలను నమ్మవద్దని స్పష్టం చేశారు.
పొదల్లో సంచరిస్తున్న పెద్దపులి
పులి కదలికలను ట్రాక్ చేస్తున్న రెస్క్యూ బృందం


