ప్రతి ఒక్కరి బాధ్యత
ద్వారకాతిరుమల: మన కంటికి కనిపించని రక్షణ కవచం.. సూర్యుడి నుంచి వెలువడే హానికర అతినీలలోహిత (యూవీ) కిరణాల నుంచి జీవరాశులను కాపాడుతున్న సహజ రక్షణ కవచమే ఓజోన్ పొర. భూమికి సుమారు 15 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఈ పొరను పరిరక్షించాల్సిన అవసరంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
యూవీ కిరణాలతో ముప్పు
సహజ వడపోతగా పనిచేసే ఓజోన్ పొర పలుచబడితే, యూవీ కిరణాలు నేరుగా భూమిని చేరి మానవాళికి పెనుముప్పుగా మారుతాయి. దీనివల్ల చర్మ క్యాన్సర్లు, కంటి శుక్లాలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలతో పాటు పంటలు, అడవులు, జల పర్యావరణ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటాయి. ముఖ్యంగా ధ్రువ ప్రాంతాల్లో (అంటార్కిటికా) ఓజోన్ పొర పలుచబడి ఏర్పడుతున్న ’ఓజోన్ హోల్’ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఓజోన్‌ను దెబ్బతీసే రసాయనాల నియంత్రణతోపాటు, ఓజోన్ పొర పరిరక్షణకు అంతర్జాతీయ స్థాయిలో సమష్టి చర్యలు ఎంత అవసరమో ఇది చాటిచెప్పింది.
పాత తప్పుల నుంచి గుణపాఠం
ఒకప్పుడు ఫ్రిజ్‌లు, ఎయిర్ కండిషనర్లు, ఏరోసోల్ స్ప్రేలు నుంచి విడుదలైన క్లోరోఫ్లోరో కార్బన్లు (సీఎఫ్‌సీలు) ఓజోన్ విచ్చిన్నానికి ప్రధాన కారణమయ్యాయి. ఈ ముప్పును గుర్తించిన ప్రపంచ దేశాలు 1987లో మాంట్రియల్ ప్రొటోకాల్పై ఒప్పందానికి వచ్చాయి. ఓజోన్ ను దెబ్బతీసే పదార్థాల ఉత్పత్తి, వినియోగాన్ని దశలవారీగా తగ్గించేందుకు దేశాలు చర్యలు చేపట్టాయి. అనంతరం చేపట్టిన అంతర్జాతీయ చర్యల ఫలితంగా ఓజోన్ పొర పునరుద్ధరణ దిశగా గణనీయమైన పురోగతి నమోదవుతోంది.
ప్రజల భాగస్వామ్యంతోనే
ఓజోన్ పరిరక్షణ కేవలం వాతావరణ రక్షణే కాకుండా గ్రీన్‌హౌస్ వాయువుల నియంత్రణకు, వాతావరణ సమతుల్యతకు కూడా దోహదపడుతుంది. ప్రభుత్వాల చర్యలతో పాటు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఏసీలు, రిఫ్రిజిరేటర్ల లీకేజీలను అరికట్టడం, పర్యావరణ హిత ఉత్పత్తులను వాడటం, ఇంధన పొదుపు పాటించడం ద్వారా ఓజోన్ పొరను, భావితరాల భవిష్యత్తును కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
భూమికి 15–35 కిలోమీటర్ల ఎత్తులో రక్షణ పొర
ఓజోన్ పలుచబడితే యూవీ కిరణాలతో ముప్పు
ఆరోగ్యంతో పాటు పంటలు, అడవులు, సముద్ర జీవులపైనా ప్రభావం
ఓజోన్ పరిరక్షణతో వాతావరణ మార్పుల నియంత్రణకూ మేలు
నేడు ప్రపంచ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం
ఓజోన్‌న్ పొర పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. పాఠశాలల్లో విద్యార్థులకు ఓజోన్ ప్రాధాన్యత, పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నాం. విద్యార్థులు ఇంట్లోనూ, సమాజంలోనూ పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలి. చిన్న వయసు నుంచే పర్యావరణ బాధ్యతను అలవర్చుకుంటే.. భావితరాలకు ఆరోగ్యకరమైన భూమిని అందించవచ్చు.
– చొక్కా కాంతారావు, సైన్స్ ఉపాధ్యాయుడు, శ్రీవారి దేవస్థానం హైస్కూల్, ద్వారకాతిరుమల


