పోక్సో కేసులో ముద్దాయికి 15 ఏళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో ముద్దాయికి 15 ఏళ్ల జైలు

Sep 16 2026 3:13 AM | Updated on Sep 16 2026 3:13 AM

పోక్సో కేసులో ముద్దాయికి 15 ఏళ్ల జైలు ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్‌ రైలు ఢీకొని మహిళ మృతి భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య

పాలకోడేరు: మైనర్‌ బాలికను అపహరించి, అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి 15 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.11,000 జరిమానా విధిస్తూ భీమవరం జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి డా. బి. లక్ష్మీనారాయణ సంచలన తీర్పు వెలువరించారు.పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామం నామనవారిపాలేనికి చెందిన నామాన భద్రాచలం (24) స్థానిక 14 ఏళ్ల మైనర్‌ బాలికను వేధింపులకు గురిచేసేవాడు. పెద్దలు మందలించినా ప్రవర్తన మార్చుకోని నిందితుడు, 2021 ఏప్రిల్‌ 20న బాలిక ఇంట్లోకి చొరబడి బలవంతంగా మోటార్‌సైకిల్‌పై అపహరించి తీసుకెళ్లాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై రామచంద్రరావు కేసు నమోదు చేశారు. పోలీసులు బాలికను రక్షించి, పోక్సో చట్టం కింద దర్యాప్తు వేగవంతం చేశారు. కోర్టులో ప్రాసిక్యూషన్‌ పక్కా సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి తీర్పునిచ్చారు. 15 ఏళ్ల ప్రధాన శిక్షతో పాటు, ఇతర సెక్షన్ల కింద మరో 7 సంవత్సరాలు, ఒక సంవత్సరం కఠిన శిక్షలు, జరిమానాలు విధిస్తూ ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయని స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉండపల్లి రమేష్‌ నాయుడు, డీఎస్పీ రఘువీర్‌ విష్ణు, ఎస్సై మంతెన రవివర్మ తదితర పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి ప్రత్యేకంగా అభినందించారు.

తణుకు అర్బన్‌: తణుకు విద్యుత్‌ శాఖ సబ్‌ డివిజన్‌ కార్యాలయ ఆవరణలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో సోమవారం మంటలు చెలరేగాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ పేలడంతో మంటలు వ్యాపించాయని, అందులోని ఆయిల్‌ పూర్తిగా కాలిపోయే వరకు మంటలు ఎగిసిపడ్డాయని విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా పట్టణంలో కొంతసేపు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి, కాలిన ట్రాన్స్‌ఫార్మర్‌ స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

నరసాపురం: బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో పోక్సో చట్టం కింద నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు టౌన్‌ సీఐ ఆకుల రఘు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన దిడ్ల ప్రసన్నకుమార్‌, పట్టణంలోని 18వ వార్డులో ఓ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్నాడు. సోమవారం అతని ఇంటి సమీపంలో ఉంటున్న బంధువులకు ప్రసాదం ఇవ్వడానికి ఓ 13 ఏళ్ల బాలిక అక్కడికి వచ్చింది. తిరిగి వెళుతున్న సమయంలో ప్రసన్నకుమార్‌ ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, రాయిపేటలో నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.

తాడేపల్లిగూడెం: గూడెం రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు పట్టాలు దాటుతున్న ఓ మహిళ సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో వందేభారత్‌ రైలు ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యారు. వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న వందేభారత్‌ రైలు ఢీకొనడంతో ఆమె శరీరం నుజ్జునుజ్జయింది. మృతురాలు తుని మండలం వీరవరం గ్రామానికి చెందిన పెనుమత్స వీరలక్ష్మిగా గుర్తించారు. గూడెం పట్టణంలోని కుమార్తె ఇంటికి వచ్చి, తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అయితే, సదరు మహిళకు వినికిడి లోపం ఉందని స్థానికులు చెబుతున్నారు.

ముదినేపల్లి రూరల్‌: భర్త అనుమానపు వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్నపాలపర్రులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుడివాడ రూరల్‌ మండలం కలవపూడి అగ్రహారానికి చెందిన ఊసల మౌనికను 12 ఏళ్ల క్రితం చిన్నపాలపర్రుకు చెందిన గంటా ఆంథోనికిచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో ఆంథోని తన భార్యను తరచూ అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా తీవ్రంగా హింసించేవాడు. ఈ విషయమై పెద్దమనుషులు పలుమార్లు రాజీ కుదిర్చినప్పటికీ, ఆంథోని తన ప్రవర్తనను మార్చుకోకుండా మౌనికను మరింత వేధించసాగాడు. భర్త వేధింపులు తట్టుకోలేకపోయిన మౌనిక.. ఇంటిలోని నీళ్ల ఇంజిన్‌ కోసం తెచ్చిన డీజిల్‌ను ఒంటిపై పోసుకుని ఈ నెల 9న నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన మౌనికను చికిత్స నిమిత్తం 108 ఆంబులెన్సులో గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతున్న మౌనిక సోమవారం రాత్రి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి సోదరుడు ఊసల అజయ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement