జంగారెడ్డిగూడెం (చింతలపూడి)/కుక్కునూరు: ట్రామడాల్ మత్తు ఇంజెక్షన్ల అక్రమ కొనుగోలు, నిల్వ, విక్రయాలకు సంబంధించిన కేసులో కుక్కునూరు మండలానికి చెందిన ఆర్‌ఎంపీను మంగళవారం అరెస్ట్ చేసినట్లు జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్ వెల్లడించారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో ఆయన వివరాలు వెల్లడించారు. ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు, జంగారెడ్డిగూడెం డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో మత్తు పదార్థాల విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు సీఐ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో మెడికల్ ఏజెన్సీలు, షాపుల యజమానులైన కాండ్రేగుల లక్ష్మణ సాయికిషోర్, ఏలూరి సతీష్, ఏలూరి దుర్గాప్రసాద్, దేవ రాజశేఖర్, తమ్మిశెట్టి చిరంజీవి, మాధవరపు శివకృష్ణలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. విచారణలో లభించిన ఆధారాల ప్రకారం.. కుక్కునూరు మండలం కివ్వాక గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ పగిల్ల నాగేంద్రకుమార్ (31) నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి బిల్లులు, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్రామడాల్ ఇంజెక్షన్లను కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి 73 ట్రామడెక్స్ ఇంజెక్షన్ అంప్యూల్స్‌తో పాటు విక్రయాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై ఎన్. వీరప్రసాద్, క్రైమ్ పార్టీ ఏఎస్‌ఐ సంపత్, కానిస్టేబుళ్లు రమేష్, షాన్‌బాబు, మణికంఠ, సత్యనారాయణ, రవికుమార్‌లను సీఐ అభినందించారు. మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.


