భీమవరం: ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న పీపీ పీ విధానాన్ని తక్షణం విరమించుకోవాలని ద స్తావేజుల లేఖర్ల సంఘం చేపట్టిన ఆందోళనలో భాగంగా శుక్రవారం పట్టణంలో భిక్షాటనతో వినూత్న నిరసన చేపట్టారు. గతనెల 30 నుంచి పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తుండగా శుక్రవారం గునుపూడి దస్తావేజు లేఖర్లంతా పట్టణంలోని ప్రధాన వీధుల్లో భిక్షాటన చేస్తూ తమ సమస్యలను ప్రజలకు వివరించారు. సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్లూరి మధు, భీమవరం సంఘం కార్యదర్శి కవురు పృద్వీశంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల విషయంలో నూతనంగా అనుసరించే పీపీపీ విధానం వల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలమంది దస్తావేజు లేఖర్ల కుటుంబాలు వీధినపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకున్నా నూతన విధానంతో తమ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం కార్యదర్శి గుండు హరిబాబు, గండ్రెడ్డి మధు, దండు శ్రీనివాసరాజు, వీరగొట్టపు అప్పారావు, రాపాక శ్యామలప్రసాద్, పామర్తి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: భీమవరం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో న్యా య సేవా కార్యకర్తగా ప నిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సంస్థ చైర్మన్, 3వ అదనపు జిల్లా జడ్జి బి.లక్ష్మీనారాయణ తెలిపారు. కనీసం 10వ తరగతి విద్యార్హత, సంఘ సేవ చేయాలనే ఆసక్తి కలిగి ఎటువంటి జీతభత్యాలు ఆశించకూడదన్నారు. సంస్థ కార్యక్రమాలను, పథకాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు, సంస్థకు మధ్య వారధిగా పనిచేయాలన్నారు. నెలాఖరులోపు విద్యార్హత నకలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కోర్టు కాంప్లెక్స్‌లోని మండల న్యాయ సేవా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాల కోసం ఫోన్ 08816 231133లో సంప్రదించాలని సూచించారు.
భీమవరం: ఎస్సీ యువతకు పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు షెడ్యూల్ కులాల సహకార సంఘం కార్యనిర్వాహక ఇంజనీర్ ఎం.ముక్కంటి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. కిసాన్ డ్రోన్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నిషియన్, బ్యూటీ థెరపిస్ట్, ప్లంబర్–జనరల్ కోర్సులకు టెన్త్ పాస్, డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, సోలార్ పీవీ ఇన్‌స్టాలర్ కోర్సులకు ఇంటర్మీడియట్ పాస్ కావాలన్నారు. అభ్యర్థుల వయసు 21–45 ఏళ్ల మధ్య ఉండాలని, శిక్షణ వ్యవధి 90 రోజులు ఉంటుందని, ఉచిత భోజనం, వసతి కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 93935 27666, 98498 42059, 91777 21350 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
నరసాపురం రూరల్: గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సబిత అన్నారు. శుక్రవారం తూర్పుతాళ్లు, లక్ష్మణేశ్వరం, నరసాపురం అర్బన్‌లో నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్ష్మణేశ్వరంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను కళాశాలగా అప్‌గ్రేడ్ చేసేందుకు కృషిచేస్తామని, సొంత భవనాల నిర్మాణానికి ప్రయత్నిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, బీసీ వెల్ఫేర్ స్టేట్ సెక్రటరీ మాధవీలత, ఆర్డీఓ దాసి రాజు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు కె.మౌనిక, షేక్ దాదా జిగిని, నాయకులు పొత్తూరి రామరాజు, కొల్లు పెద్దిరాజు పాల్గొన్నారు.


