భీమవరం: నీట్ పేపరు లీకేజీ ఘటనలో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లావఆయప్తంగా శుక్రవారం వివిధ విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్‌లో ప్రవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేయగా ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా కొనసాగాయి. పట్టణంలోని ప్రకాశంచౌక్ సెంటర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్, ఏఐఎస్‌ఏ జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్ సుందర్ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. పేపరు లీకేజీపై దాదాపు నెలరోజులుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. దాదాపు 20 మంది ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వారి కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. సీపీఐ నాయకుడు చెల్లబోయిన రంగారావు, సీపీఎం నాయకులు జేఎన్‌వీ గోపాలన్, కె.రాజారామ్మోహన్‌రాయ్, కె.క్రాంతిబాబు తదితరులు బంద్‌కు సంఘీభావం తెలిపారు.


