గళమెత్తిన నేతలు
జిల్లా కేంద్రం భీమవరం జనసంద్రమైంది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వెల్లువలా తరలివచ్చిన జనసునామీతో పరవళ్లు తొక్కింది. సిండికేట్ దోపిడీతో కుదేలవుతున్న ఆక్వా రైతులకు అండగా వచ్చిన జననేత నామస్మరణతో మార్మోగింది. సభ ఆద్యంతం ఆక్వా రైతుల్లో కొండంత ధైర్యాన్ని నింపింది.
గురువారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి, భీమవరం: సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేట్ లూటీతో సంక్షోభంలో కూరుకుపోయిన ఆక్వా రైతుల పక్షాన బుధవారం భీమవరం వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జనం బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి సభకు వేలాదిగా తరలివచ్చిన ఆక్వా రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులతో ఉదయం 8 గంటల సమయానికే భీమవరంలోని ఉండి బైపాస్‌రోడ్డు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, లోసరి, నరసాపురం రోడ్లు రద్దీతో నిండిపోయాయి. బైపాస్‌రోడ్డులోని డాక్టర్ బీవీ రాజు విగ్రహం సమీపంలో ఏర్పాటచేసిన సభా ప్రాంగణం, హెలీప్యాడ్ ఏర్పాటుచేసిన లూథరన్ గ్రౌండ్ జనంతో నిండిపోయాయి. ఉదయం 10.30 గంటలకు జగన్ హెలీప్యాడ్‌కు చేరుకోగా శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడి నుంచి తాలుకా సెంటర్, ప్రకాశంచౌక్, అంబేడ్కర్ సెంటర్, బీవీరాజు విగ్రహం మీదుగా సభాస్థలికి చేరుకున్నారు. సంక్షేమ సారధిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన స్థానిక మహిళలు, అభిమానులతో తాలుకాఆఫీస్ రోడ్డు, ప్రకాశం చౌక్ సెంటర్లు కిక్కిరిసిపోయాయి. జనం రద్దీతో హెలీప్యాడ్ నుంచి సభాప్రాంగణం వరకు దాదాపు కిలోమీటరు మేర దూరానికి గంటకు పైగా సమయం పట్టింది. దారిపొడవునా జనానికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు.
ముద్రగడకు నివాళి
సభ ప్రారంభానికి ముందుగా వేదికపై ఏర్పాటుచేసిన దివంగత వైఎస్సార్, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిత్రపటాలకు జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని అంజలి ఘటించారు.
ఆక్వా రైతులకు భరోసాగా..
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన జరిగిన సభలో జగన్ ప్రసంగం ఆద్యంతం ఆక్వా రైతులకు కొండంత భరోసానిస్తూ సాగింది. 2019–24 మధ్యకాలంలో ఆక్వా రైతులను ప్రోత్సహిస్తూ వైఎస్సార్ ప్రభుత్వం రూ. 1.50 రాయితీ విద్యుత్ అందించడం, సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు దోపిడీని అరికట్టేందుకు అప్సడాను తీసుకురావడం తదితర కృషిని వివరించారు. 2024 ఎన్నికల్లో ఆక్వా రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. జోన్‌తో సంబంధం లేకుండా ఎంతమంది రైతులకు రాయితీ విద్యుత్‌ను అందించారని జగన్ ప్రశ్నించగా ఎవరికి ఇవ్వలేదని రైతులు చెప్పారు.
కోల్డ్ స్టోరేజీలు కట్టించారా? ఏరియేటర్స్‌పై సబ్సిడీ ఇస్తున్నారా? అని ప్రశ్నించగా ఏమీ చేయలేదని రైతులు సమాధానమిచ్చారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు టీడీపీకి చెందిన వారే కావడంతో చంద్రబాబు వారి దోపిడీకి కొమ్ముకాస్తున్నారని ధ్వజమెత్తారు. ఆక్వా రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా పోరాడుతుందని, రాబోయే మన ప్రభుత్వంలో సిండికేట్‌ను నామరూపల్లేకుండా చేస్తానన్న జగన్ భరోసాతో సభాప్రాంగణం మొత్తం రైతుల హర్షధ్వానాలతో మార్మోగింది. జగన్ ప్రసంగిస్తున్నంతసేపు ఈలలు, చప్పట్లతో ప్రజలు, అభిమానులు మద్దతు పలికారు. సీఎం..సీఎం అంటూ యువత నినాదాలతో హోరెత్తించారు.
పొగాకు రైతులకు అండ
పొగాకుకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని సభలో ఏలూరు జిల్లాకు చెందిన పలువురు రైతులు తమ వెంట తీసుకువచ్చిన పొగాకును జగన్‌కు చూపించారు. ధర అందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధైర్యపడవద్దని అండగా ఉంటామని జగన్ వారికి భరోసానిచ్చారు.
ఆక్వా రైతులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పోటెత్తిన జిల్లా కేంద్రం
అడుగడుగునా జననేతకు బ్రహ్మరథం
జగన్ నినాదంతో మార్మోగిన భీమవరం
ఆక్వా రైతులకు భరోసానిచ్చిన జగన్ పర్యటన


