గతంలో ఎన్నడూ లేని విధంగా టన్ను మేత ధర రూ. 3.50 లక్షల నుంచి ఏకంగా రూ. 7.50 లక్షలకు పెరిగింది. మార్కెట్ బాగుంటుందనే ఆశతో సాగు చేస్తుంటే నష్టాలే మిగులుతున్నాయి. మా ఇబ్బందులపై గత రెండేళ్లుగా పోరాడుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. గతంలో మేలు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం.
– చేకూరి వెంకట నర్సింహరాజు, ఆక్వా రైతు, పొన్నమండ
నేను 20 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నాను. పెట్టుబడుల ధరలు పెరిగినా, మార్కెట్ బాగుంటుందనే ఆశతోనే సాగును కొనసాగిస్తున్నాను. మార్కెట్‌లో రొయ్యల కౌంట్ లెక్కింపులో వ్యాపారులు మోసాలు చేస్తున్నారు. 92 కౌంట్ ఉండాల్సిన రొయ్యను 100 కౌంట్‌గా చూపిస్తూ నష్టపరుస్తున్నారు. విద్యుత్, ఫీడు, సీడు, మందుల ధరల భారాన్ని కూడా జగన్ దృష్టికి తీసుకెళ్లాం.
– సాగి సూర్యనారాయణరాజు, ఆక్వా రైతు, కలవపూడి
ఆక్వా రంగం సంక్షోభంలో పడటంతో మాలాంటి చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. మేత ధరలు పెరగడం, రొయ్యల ధరలు తగ్గడంతో రైతులు సాగు చేయడానికి భయపడుతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల రైతుల నుంచి రొయ్యలు కొనుగోలు చేసే చిన్న ట్రేడర్లకు ఉపాధి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి జగన్ ముందుకు రావడం ఆనందదాయకం.
– గొట్టుముక్కల వెంకటలక్ష్మి, ఆక్వా ట్రేడర్, భీమవరం
ఆక్వా రంగ సమస్యలపై పోరా డుతున్న రైతులకు జగన్ అండగా నిలవడం కొండంత భరోసానిచ్చింది. మేత, మందుల ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పినా ధరలు తగ్గకపోవడాన్ని చూస్తే సిండికేట్ వ్యవస్థ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఆక్వా రైతులకు ఏ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వం తక్షణమే స్పందించేది.
– కె.సర్వేశ్వరరావు, ఆక్వా సంఘ నాయకుడు, వీరవాసరం
రొయ్యల రైతులకు ప్రస్తుతం అత్యంత గడ్డుకాలం నడుస్తోంది. మార్కెట్‌లో సీడు, ఫీడు, మెడిసిన్ ధరలను కంపెనీలు ఇష్టారాజ్యంగా పెంచుతున్నాయి. రైతు కష్టపడి పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. సిండికేట్ మాయాజాలంలో చిక్కుకుని ఆక్వా రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యలన్నింటినీ అధిగమించడానికి, మాకు తగిన న్యాయం జరగడానికి మా కష్టాలన్నింటిని జగన్‌కి వివరించాం.
– మండపాక రాంబాబు, రొయ్యల రైతు, మహాదేవపట్నం


