ఆక్వా రంగం సంక్షోభంలో కూరుకుపోయి రైతులు విలవిల్లాడుతున్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. రాజకీయాలకు అతీతంగా రైతులంతా రోడెక్కి ఆందోళనలు చేస్తున్నా ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లు లేదు. కూటమి నాయకులు ఆక్వా రైతులకిచ్చిన హామీలు మెడలు వంచి అమలు చేయించేందుకే జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు అండగా పోరాటం చేస్తున్నారు.
– ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్‌సీపీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల పక్షపాతిగా రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నారు. ముఖ్యమంత్రిగా రైతులకు పెట్టుబడి సహాయం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించడం, పంటలకు మద్దతు ధరలు కల్పించడంలో జగన్ ముందున్నారు. అనేక ఇబ్బందులతో పోరాటం చేస్తున్న ఆక్వా రైతులకు అండగా ఉండి ప్రభుత్వం కళ్లు తెరిపించడానికే జగన్ పోరుబాట పట్టారు.
– దూలం నాగేశ్వరరావు,
వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు
వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ రైతులకు అండగా నిలుస్తుంది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రొయ్యలు, వరి, పొగాకు, టమోట, మిర్చి, మామిడి తదితర పంటలు పండించే రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్ట్‌లతో వేధిస్తున్నారు తప్ప రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు.
– కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి, తణుకు
ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోడానికి కూటమి ప్రభుత్వమే కారణం. ఆక్వా రైతులకు ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారు. ఆక్వా జోన్స్‌తో సంబంధం లేకుండా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టి రెండేళ్లు గడిచిపోయినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఫీడ్ ధరలు పెంచితే ముఖ్యమంత్రి కిలోకు రూ.4 తగ్గించాలని ఆదేశించినా మొక్కుబడిగా రూ.2 తగ్గించి చేతులు దులుపుకున్నా ఎలాంటి చర్యలు లేవు.
– పుప్పాల వాసుబాబు,
మాజీ ఎమ్మెల్యే, ఉంగుటూరు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రొయ్యల సమస్యలను పరిష్కరించడానికి ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా)ను ఏర్పాటుచేయడంతో రొయ్యల ధరలు నిలకడగా ఉండడమేగాక ఫీడ్, సీడ్ ధరలు అదుపులో ఉండేవి. రైతులకు ఉపయోగపడేలా నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. నేడు అప్సడా నిర్వీర్యమైంది. ఎన్నడూలేని విధంగా ఫీడ్ ధరలు పెంచినా పట్టించుకున్న నాథుడే లేడు.
– వడ్డి రఘురామ్, అప్సడా మాజీ వైస్ చైర్మన్
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతి రేకత ఏర్పడింది. ఇటీవల ఆక్వా రైతుల ఆక్రందనలు, పోరాటాలు చూస్తుంటే రైతుల్లో చంద్రబాబు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అవగతమవుతోంది. జగన్ ప్రభుత్వంలో జరిగిన మేలును అన్ని వర్గాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.
– చినమిల్లి వెంకటరాయుడు,
వైఎస్సార్‌సీపీ భీమవరం సమన్వయకర్త
కొంతకాలంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోవడం వల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా రోడెక్కి ఆందోళన బాట పట్టారు. రోడ్లపై ఫీడ్ బస్తాలు తగలబెట్టడం, రొయ్యల రోడ్డుపై పారబోసి ఆందోళన చేయడం వంటి ఆందోళనలు చేపట్టారు. రైతుల ఆందోళనలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సైతం పాల్గొంటున్నారంటే ప్రభుత్వంపై రైతుల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేటతెల్లమవుతోంది.
– మామిళ్లపల్లి జయప్రకాష్,
వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త


