ఆవకాయకు ధరల ఘాటు | - | Sakshi
Sakshi News home page

ఆవకాయకు ధరల ఘాటు

May 7 2026 9:44 AM | Updated on May 7 2026 9:44 AM

కొనేవారు లేరు పచ్చడి పట్టడం మానేశాం

ముడి సరుకుల ధరలు ఇలా..

మండుతున్న పచ్చడి ముడిసరుకుల ధరలు

కొనేవారు లేక మామిడి కాయ ధరలు ఢీలా

లబోదిబోమంటున్న మామిడి రైతులు

ఈ ఏడు మామిడి పంట దిగుబడి బాగా తక్కువ వచ్చింది. దాంతో పచ్చడి మామిడి కాయలకు మంచి ధర వస్తుందని ఆశించాం. ప్రస్తుతం కాయలు కొనేవారు లేరు. దాంతో తక్కువ ధరలకు కాయలను అమ్మాల్సి వస్తోంది. గతంతో పోలిస్తే పచ్చడి మామిడి కాయల విక్రయాలు బాగా తగ్గాయి.

–బడే చెన్నారావు,మామిడి కౌలు రైతు, ద్వారకాతిరుమల

పచ్చడి తయారీకి వినియోగించే ముడి సరుకుల ధరలు నింగినంటాయి. దాంతో వ్యయ ప్రయాసలు పడి పచ్చళ్లు పట్టడం ఎందుకని మానేశాం. ప్రజలకు రోజురోజుకు అనారోగ్య సమస్యలు పెరుగుతుండటం, మార్కెట్లో పలు రకాల పచ్చళ్లు దొరుకుతుండటం కూడా ఆవకాయ పచ్చడి పట్టేవారి సంఖ్య తగ్గడానికి ఒక కారణం.

– బండి శివ పార్వతి,

రాళ్లకుంట, ద్వారకాతిరుమల మండలం

ద్వారకాతిరుమల: పచ్చళ్లు.. ఈ పేరు చెబితేనే నోరూరుతుంది. ముఖ్యంగా ఆవకాయ పేరు వినగానే ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అన్నట్టు మనసు జివ్వున లాగేస్తుంది. తాతల కాలం నుంచి ప్రతి ఇంట్లో పచ్చడి తయారు చేసుకోవడం.. దాన్ని జాడీల్లో నిల్వ ఉంచుకుని ఏడాది పాటు వినియోగించుకోవడం మనందరికీ తెలిసిందే. నోరూరించే పసందైన పచ్చళ్లకు వేసవి పెట్టింది పేరు. ఈ సీజన్‌లో లభించే పచ్చడి మామిడి కాయలకు భలే డిమాండ్‌ ఉంటుంది. అయితే ఈ ఏడు మామిడి రైతులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పూత దశలో మంచు ఎక్కువగా కురవడంతో ఈసారి మామిడి కాపు బాగా తగ్గింది. చేతికందొచ్చిన పంటకై నా మంచి ధర లభిస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. కొనేవారు లేక పచ్చడి మామిడి కాయల ధరలు డీలా పడ్డాయి. పచ్చళ్లు తయారీకి వినియోగించే ముడి సరుకుల ధరలు మాత్రం నింగినంటాయి. పెరిగిన ధరలు భారంగా మారడంతో నిరుపేద ప్రజలు పచ్చళ్లు పట్టుకోవడం మానేస్తున్నారు. మధ్యతరగతి వారు గతంతో పోలిస్తే సగానికి సగం పైగా తగ్గించేస్తున్నారు. దాంతో పచ్చడి మామిడి కాయలు కొనేవారు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎగుమతులు తగ్గడంతో.. ఏలూరు జిల్లాలో సుమారు 39 వేల ఎకరాల్లో మామిడి పంట సాగవుతోంది. అత్యధికంగా ఆగిరిపల్లి మండలంలో 15,500, నూజివీడు మండలంలో 13 వేల ఎకరాల్లో సాగవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు తగ్గాయని, మామిడి కాయల ధరలు తగ్గుదలకు ఇది కూడా ఒక కారణమని రైతులు చెబుతున్నారు.

ఏ కాయ ధర ఎంతంటే

తోటల్లో రైతుల వద్ద చిన్న రసం కాయ రూ.8 నుంచి రూ.10, కొత్తపల్లి కొబ్బరి రకం రూ.20 నుంచి రూ.30, పెద్ద రసం కాయ రూ.20, దేశవాళి కాయ రూ.5 నుంచి రూ.10, హైదర్‌ సాహెబ్‌ కాయ ధర రూ.15 పలుకుతోంది. ఆవకాయ పచ్చళ్ల తయారీకి ఈ కాయలనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. పెరిగిన ముడి సరుకుల ధరల కారణంగా ఇప్పుడు పేద, మధ్య తరగతి ప్రజలకు పచ్చడి పట్టడం భారంగా మారింది. దాంతో వారికి ఆవకాయ అందనంత దూరంలో ఉంది. అందుకే ప్రస్తుత సీజన్‌లో పచ్చళ్ల హడావుడి ఎక్కడా కనబడటం లేదు.

రిటైల్‌ మార్కెట్‌లో..

రకం ప్రస్తుత ధర గతేడాది ధర

(కిలో రూ.ల్లో) (కిలో రూ.ల్లో)

పప్పు నూనె 400 360

(గానుగ వద్ద)

వేరుశనగ నూనె 300 250

(గానుగ వద్ద)

ఎండుమిర్చి 500–600 250–300

ఆవాలు 120 120

మెంతులు 120 120

వెల్లుల్లిపాయలు 120 200

ఉప్పు 20 20

Advertisement
 
Advertisement
Advertisement