గోదావరిలో స్నానానికి దిగిన వ్యక్తి మృతి
యలమంచిలి: అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన వినుకొండ రామానాయుడు (43) గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయాడని భార్య లక్ష్మీ మానస ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపారు. రామానాయుడు భీమవరంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 7న మొగలికుదురు బయలుదేరిన రామానాయుడు మార్గ మధ్యలో చించినాడలో గోదావరిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మునిగిపోయాడు. గత రెండు రోజులుగా గాలించగా శుక్రవారం గోదావరిలో కొత్తగా నిర్మాణంలో ఉన్న రైలు వంతెన వద్ద మృతదేహం పైకి తేలింది. దీంతో శవపంచనామా, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులుకు మృతదేహం అప్పగించినట్లు ఎస్సై గుర్రయ్య తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నట్లు ఆయన వివరించారు.


