కోకో గింజలకు ధర పాలసీ ప్రకటించాలి
ఏలూరు (టూటౌన్): కోకో గింజలకు ధర పాలసీ ప్రకటించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్‌కు కోకో రైతులు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు పి. సుబ్రహ్మణ్యేశ్వర రావు, పానుగంటి అచ్యుతరామయ్య, గుది బండి వీరారెడ్డి, కోనేరు సతీష్ బాబు, ఆలపాటి శ్రీనివాసరావు మాట్లాడారు. కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించి వేసి రైతులను మోసగిస్తున్నాయని చెప్పారు. విదేశీ కోకో దిగుమతులపై దిగుమతి సుంకాలు పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో కోకో గింజలకు రూ.550లకు పైగా ధర ఉండగా కంపెనీలు రూ.350లకు కొనుగోలు ప్రారంభించి గత రెండు రోజుల నుంచి రూ.400 లకు రైతుల ఆందోళనతో పెంచారని వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ ధర రైతులకు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. దేశంలోనే ఏలూరు జిల్లాలో అత్యధిక కోకో పంట విస్తీర్ణం ఉన్నదని, కేంద్ర కోకో పరిశోధనా కేంద్రాన్ని, రాష్ట్రంలో కోకో బోర్డును ఏర్పాటు చేయాలని ఫలితంగా కోకో రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. దీనిపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ కోకో రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కోకో గింజల ధర ఫార్ములా కోసం కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కోకో రైతులు పాల్గొన్నారు.
ఏలూరు ఎంపీకి కోకో రైతుల వినతి


