అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
పాలకోడేరు: పలుచోట్ల చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగను పాలకోడేరు పోలీసులు పట్టుకున్నారు. నేరస్తుడి నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పాలకోడేరు పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ పి.రఘువీర్ విష్ణు గురువారం వివరాలు వెల్లడించారు. గత నెల 29వ తేదీన విస్సాకోడేరు కు చెందిన కలిదిండి లావణ్య, భర్త శ్రీనివాసరావు ఇంటికి తాళం వేసి భీమవరం ఆసుపత్రికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బంగారం, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో మచిలీపట్నం రూరల్, మోకావారి పాలెం, నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన నిందితుడు ఆరేపల్లి దుర్గారావును ఈనెల 7వ తేదీ సాయంత్రం గొల్లలకోడేరు సెంటర్‌లో పాలకోడేరు ఎస్సై రవివర్మ అరెస్టు చేశారు. అతడిపై ఇప్పటికే కృష్ణా, గుంటూరు, ఏలూరు, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 145 దొంగతనాల కేసులున్నాయని, 30 సార్లు జైలుకు కూడా వెళ్లనట్లు డీఎప్పీ చెప్పారు. చోరీ కేసుల్లో పాలకోడేరు పోలీస్ స్టేషన్‌కు సంబంధించి రూ.2.35 లక్షలు, పెనమలూరు పోలీస్ స్టేషన్ కు సంబంధించి రూ.4.25 లక్షలు, కై కలూరు పోలీస్ స్టేషన్‌కు సంబంధించి రూ.18 వేలు, శ్రీ కాళహస్తి పోలీస్ స్టేషన్ కు సంబంధించి రూ.40 వేలు విలువైన బంగారం, వెండి ఆభరణాలు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డీఎప్పీ చెప్పారు.


