కూటమిలో బయటపడిన విభేదాలు
కొయ్యలగూడెం: పోలవరం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం అట్టహాసంగా నిర్వహించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పుట్టినరోజు వేడుకలకు నియోజకవర్గంలోని ఏడు మండలాల కూటమి పార్టీల ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులతో పాటు దాని మిత్రపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు కూడా ముఖం చాటేశారు. మరోపక్క ఈ కార్యక్రమానికి డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున తరలించారు. వీరితో పాటు సీఏల ద్వారా జన సమీకరణకు అధికారులు సహకరించారు. కొయ్యలగూడెంలోని ఏఎంసీ యార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం. ఇదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్రాంతి వేడుకల ఆటవిడుపు కార్యక్రమాలను కూడా ఎమ్మెల్యే ప్రారంభించి బహుమతులు అందజేశారు.


