చినవెంకన్న హుండీ ఆదాయం రూ.2.09 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో గురువారం అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ జరిగింది. గడచిన 16 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,09,40,260 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజి తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 79 గ్రాముల బంగారం, 3.552 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రద్దయిన పాత నోట్లు ద్వారా రూ.5,500 లభించినట్టు చెప్పారు. లెక్కింపులో జిల్లా దేవాదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు, ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా దళం సభ్యులు పాల్గొన్నారు.


