భాగవతోత్తముడు త్యాగరాజు
భీమవరం: త్యాగరాజు 96 కోట్ల నారాయణ జపం చేసి శ్రీసీతారామచంద్రుల దర్శనం పొందిన భాగవతోత్తముడని మహా సహస్రావధాని గరికిపాటి నర్సింహారావు అన్నారు. భీమవరం పట్టణంలోని త్యాగరాజ భవనంలో నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో భాగంగా బుధవారం గరికిపాటి త్యాగరాజు రామాయణంపై ప్రవచనం చేశారు. దేశమంతా మోగుతున్న నినాదం జై శ్రీరామ్ నామ మంత్రమని, నాదోపాసనతో పరబ్రహ్మను చేరవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు త్యాగరాజు అన్నారు. శ్రీరామ దర్శనం పొంది భగవంతుడున్నాడన్న సత్యాన్ని చాటిన నిష్కార్మయోగి, తెలుగు భాష తీయందనాన్ని, సాహితీ పరిమళాలను విశ్వవ్యాప్తం చేసిన ధన్యజీవి, మోక్ష సాధన మార్గాల్లో సంగీతం ఒకటని తలచి తన సంకీర్తనల ద్వారా భగవంతునికి చేరువై మోక్ష ప్రాప్తి పొందిన మహనీయుడు త్యాగరాజస్వామి అంటూ కీర్తించారు.
ఉండి: చెరువుల వద్ద కాపలా ఉంటున్న ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉండి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండి శివారు ఉప్పుగుంట వద్ద ఇందుకూరి నారాయణరాజు చెరువులపై నివశిస్తున్న దీప్ జ్యోత్ బాసుమతి (21) బుధవారం ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అస్సాం రాష్ట్రం సీమన్ చపూరినుంచి వచ్చి చెరువులపై కాపలా ఉంటున్నాడని, కొంతకాలంగా ఇంటికి వెళ్లిపోదామని చెబుతున్నాడని, ఇంతలో ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి సుకుమార్ బాసుమతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.


