కృత్రిమ గర్భధారణతో మేలు జాతి దూడలు
పునరుత్పత్తి సామర్థ్యం పెంపు ఇలా..
నాటు పశువుల్లోనూ.. మేలు జాతి దూడలు
భీమవరం అర్బన్: రైతులు, పశు పెంపకందారులు పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే పశువుల పెంపకం, వాటి పునరుత్పత్తి అంశంపై తగిన శ్రద్ధ చూపాలి. అప్పుడే పాడి పరిశ్రమ లాభాల బాట పడుతుంది. పాడి పశువు ఈతకు ఈతకు మధ్య 14 –15 నెలల ఎడం ఉంటేనే లాభదాయకంగా ఉంటుందంటున్నారు మండల పశు వైద్యాధికారి పి.పుండరీ బాబు. పశువుల సంతానోత్పత్తి ఎక్కువగా చలికాలంలో ఆస్కారం ఉంటుందని, ముఖ్యంగా ఎక్కువ శాతం గేడెలు చలికాలంలోనే ఎదకు వస్తాయని చెబుతున్నారు. ఎద లక్షణాలు కనిపించన వెంటనే కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు వేయిస్తే చూడి కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ఇంకా గేదేలు చూడి కట్టడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.
14 గంటల్లో అండం విడుదల
సాధారణంగా ఎదకు వచ్చిన తర్వాత 14 గంటలకు అండం విడుదలవుతుంది. ఎదకు వచ్చిన పశువులను కృత్రిమ గర్భధారణ చేయించే వరకు ఇతర పశువులు దాటకుండా జాగ్రత్త పడాలి. బయటికి వదలకూడదు. ఎద మొదలైన 12 గంటల తర్వాత కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు చేయించాలి. ఉదయం ఎదకు వస్తే సాయంత్రం, సాయంత్రం ఎదకు వస్తే మరుసటిరోజు ఉదయం గర్భధారణ చేయించాలి. ఇలా చేయించిన తర్వాత రోజంతా ఇంట్లోనే కట్టి వేయాలి. బయటకు వదలకూడదు. ఎద లక్షణాలు మరుసటి రోజు కూడా కన్పిస్తే తిరిగి రెండోసారి గర్భధారణ చేయించాలి.
మూగ ఎద లక్షణాలను గుర్తించాలి
పశువుల్లో కృత్రిమ గర్భోత్పత్తి ఫలప్రదం కావాలంటే ఎద లక్షణాలు స్పష్టంగా గుర్తించి సరైన సమయంలో వీర్యదానం చేయించాలి. గేదె నిలకడ లేకుండా తిరుగుతూ, పళ్లు ఇకిలిస్తూ అరుస్తుంటే ఎదకు వచ్చినట్లు గుర్తించాలి. తాడు తెంచుకుని పరుగులు తీస్తుంది. ఇతర పశువులను నాకుతూ వాటిపైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటాయి. పశువు మానం ఉబ్బి పగలు తీగలు వేస్తుంది. తరచుగా మూత్ర విసర్జన చేస్తుంది. ఇలాంటి లక్షణాలు పశువు ఎదకు వచ్చినట్లు గుర్తించేందుకు ఉపయోగపడతాయి. కొన్ని పశువుల్లో ఎదకు వచ్చినా ఈ లక్షణాలు బయటకు స్పష్టంగా కన్పించవు. ఆ పరిస్థితిని మూగ ఎద అంటారు.
గేదెల్లో ఎద లక్షణాలు అంత స్పష్టంగా కన్పించవు. కాబట్టి ఎదను గుర్తించడం కొంచెం కష్టం. అటువంటప్పుడు కొన్ని సూచనలు పాటించడం ద్వారా ఎదను గుర్తించి పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
వేసెక్టమీ చేసిన దున్నపోతులను నాలుగు గంటల కొకసారి మందలో తిప్పటం ద్వారా గేదెల్లో ఎదను గుర్తించవచ్చు.
గేదెలకు ఒకసారి కృత్రిమ గర్భధారణ చేసిన తరువాత తిరిగి మరుసటి రోజుకూడా చేయించడం మంచిది.
గేదెలు సాధారణంగా వేసవి కాలంలో ఎదకు రావు. చల్లని వాతావరణం కల్పించినట్లయితే ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందుకు రోజుకు రెండు మూడు సార్లు చల్లని నీటితో కడగాలి. అవకాశం ఉంటే నీటిలో ఈదించాలి.
గేదెలను రెండు మూడు గంటల పాటు చీకట్లో ఉంచితే త్వరగా ఎదకు వచ్చే అవకాశం ఉంటుంది.
కృత్రిమ గర్భధారణ చేసిన వెంటనే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు గేదెలను చల్లని నీటిలో కడిగినా, నీటిలో ఈదించినా లేదా నీడలో కట్టివేసినా చూలు నిలిచే అవకాశం ఉంది.
కృత్రిమ గర్భధారణ నాటు గేదెలు, ఆవులకు చేయించవచ్చు. నాటు పశువులకు ఎద లక్షణాలు గుర్తించి కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్ వేయిస్తే మేలు జాతి దూడలు వృద్ధి చెందుతాయి. తద్వారా రైతులు, పశు పెంపకం దారులు ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చు.
– పి.పుండరీబాబు, పశు వైద్యాధికారి, భీమవరం మండలం
కృత్రిమ గర్భధారణతో మేలు జాతి దూడలు


