శ్రీవారి ఆలయంలోకి సెల్‌ఫోన్లు.. నో ఎంట్రీ
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలోకి భక్తులు ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకెళ్లకుండా సెక్యూరిటీ అధికారులు శనివారం చర్యలు చేపట్టారు. స్వామివారి దర్శనార్థం శుక్రవారం ఆలయానికి విచ్చేసిన కామవరపుకోటకు చెందిన ఓ భక్తుడు శ్రీవారి మూలవిరాట్ ఫొటో తీసి, వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడంతో రేగిన కలకలంపై, భద్రతా వైఫల్యాలపై పలు పత్రికల్లో శనివారం కథనాలు ప్రచురితమయ్యాయి. దాంతో అప్రమత్తమైన చీఫ్ సెక్యూరిటీ అధికారి జీవీఎస్ పైడేశ్వరరావు ఉదయం సిబ్బందికి పలు సూచనలిచ్చారు. దాంతో సిబ్బంది భక్తుల సెల్ ఫోన్లను ఆలయంలోకి అనుమతించడం లేదు. ప్రధానంగా ఆలయ తూర్పు రాజగోపురం గేటు వద్ద సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. దాంతో సెల్‌ఫోన్లు నో ఎంట్రీ అంటూ.. వాటిని కౌంటర్లో భద్రపరచుకోవాలని భక్తులకు సిబ్బంది సూచించారు. ప్రొటోకాల్ కార్యాలయం నుంచి ఆలయంలోకి వెళుతున్న వారి వద్దే ఎక్కువగా ఫోన్లు ఉంటున్నాయి. సాధారణ భక్తులెవరూ ఫోన్లతో ఆలయంలోకి వెళ్లడం లేదు. ఇదిలా ఉంటే అధికారులు ఈ చర్యలను ఇలాగే పకడ్భందీగా కొనసాగించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
వీరవాసరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, 17 బాలుర క్రికెట్ జట్ల ఎంపికలు ఏలూరు దగ్గర వంగూరు ఏఎన్‌ఎం క్రికెట్ అకాడమీ గ్రౌండ్స్ నందు ఈనెల 24వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కార్యదర్శులు కె.అలివేలుమంగ, డి.సునీత, కే దుర్గాప్రసాద్, పీఎస్‌ఎన్ మల్లేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ఎంపికల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు ఉదయం 9 గంటలకల్లా రిపోర్ట్ చేయాలన్నారు. వివరాలకు సెలెక్షన్ ఆర్గనైజర్ రమేష్ రాజు సెల్: 98853 24848లో సంప్రదించాలన్నారు.


